ఒలింపిక్స్‌లో మరో తప్పిదం.. సౌత్ సూడాన్‌ దేశ జాతీయ గీతంలో పొరపాటు

by Harish |
ఒలింపిక్స్‌లో మరో తప్పిదం.. సౌత్ సూడాన్‌ దేశ జాతీయ గీతంలో పొరపాటు
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో మరో తప్పిదం జరిగింది. ప్రారంభ వేడుకల్లో దక్షిణ కొరియా బృందాన్ని ఉత్తర కొరియాకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సౌత్ సుడాన్ జాతీయ గీతంలో నిర్వాహకులు పొరపాటు చేశారు. ఆదివారం సౌత్ సుడాన్, ప్యూర్టో రికో మధ్య బాస్కెట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ తప్పిదం చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడ్డారు. ఆ సమయంలో నిర్వాహకులు సౌత్ సుడాన్ దేశానికి సంబంధించిన జాతీయ గీతం కాకుండా వేరేది ప్లే చేశారు. దీంతో ఆ దేశ అభిమానులు, ఆటగాళ్లు అయోమయానికి గురయ్యారు. వెంటనే ఫ్యాన్స్ సౌత్ సుడాన్ జాతీయ జెండా ప్రదర్శించడంతోపాటు చప్పట్లతో నిరసన తెలిపారు. దీంతో తేరుకున్న నిర్వాహకులు సరైన గీతాన్ని ప్లే చేశారు. సౌత్ సుడాన్ బాస్కెట్‌బాల్ టీమ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. అరంగేట్ర మ్యాచ్‌లో సౌత్ సుడాన్ అదరగొట్టింది. ప్యూర్టో రికో‌పై 90-79 తేడాతో విజయం సాధించి ఒలింపిక్స్‌లో తొలి విజయాన్ని రుచిచూసింది. కార్లిక్ జోన్స్ 19 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story

Most Viewed