Aus vs Sco: మ‌రోసారి ట్రావిస్ హెడ్ విధ్వంసం.. మొదటి T20లో స్కాట్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం

by Maddikunta Saikiran |
Aus vs Sco: మ‌రోసారి ట్రావిస్ హెడ్ విధ్వంసం.. మొదటి T20లో స్కాట్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: స్కాట్లాండ్(Scotland) వేదికగా బుధవారం జరిగిన మొదటి టీ20లో ఆస్ట్రేలియా(Australia) 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయం సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో స్కాట్లాండ్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగుల చేసింది.స్కాట్లాండ్ బ్యాటర్లలో జార్జ్ మున్సే(George Munsey) (28), మాథ్యూ క్రాస్(Matthew Cross) (27), కెప్టెన్ బెర్రింగ్టన్(Berrington) (23) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్(Sean Abbott) మూడు వికెట్లు పడగొట్టాడు.జాంపా(Jampa), బార్ట్లెట్ (Bartlett) చెరో రెండు వికెట్లు తీశారు.

లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 80 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) భీకర హిట్టింగ్‍తో చెలరేగాడు. ఆరంభం నుంచి బౌండరీలు మోత మోగించాడు. స్కాట్లాండ్ బౌలర్లకు చుక్క‌లు చూపిస్తూ త‌న బ్యాట్ తో విరుచుకుప‌డ్డాడు.ఈ మ్యాచ్‍తోనే అరంగేట్రం చేసిన ఆసీస్ యంగ్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (Jake Fraser-McGurk) తొలి ఓవర్ మూడో బంతికే డకౌట్ అయ్యాడు. మిచెల్ మార్ష్(Mitchell Marsh) 12 బంతుల్లో 39 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో అదరగొట్టాడు. కాగా పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. కంగారూ జట్టు 6 ఓవర్లలోనే 113 పరుగులు చేసింది.కాగా గతేడాది పవర్ ప్లేలో 102 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పేరిట ఈ రికార్డు ఉండేది.ఇప్పుడు స్కాట్లాండ్ జట్టుపై ఆరు ఓవర్లలోనే 113 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్ రికార్డును ఆసీస్ కైవసం చేసుకుంది.కాగా మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా (1-0)తో ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed