ఆర్చరీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు కుర్రాడు

by Harish |
ఆర్చరీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు కుర్రాడు
X

దిశ, స్పోర్ట్స్ : ఇరాక్‌లోని బాగ్దాద్‌ జరుగుతున్న ఆసియా కప్ ఆర్చరీ లెగ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ధీరజ్ 7-1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అమీర్ ఖాన్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌లో డ్రా చేసుకున్న ధీరజ్.. మిగతా మూడు సెట్లను దక్కించకుని ఫైనల్‌కు చేరకున్నాడు. మరో సెమీస్‌లో భారత ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ 6-2 తేడాతో బంగ్లాదేశ్ ఆర్చర్ హకీమ్ అహ్మద్‌ను ఓడించాడు. ఫైనల్‌లో తరుణ్‌దీప్ రాయ్‌తో ధీరజ్ తలపడనున్నాడు. రికర్వ్ మహిళల కేటగిరీలో సిమ్రాన్‌జీత్ కౌర్, దీపిక కుమారి ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌ మ్యాచ్‌ల్లో సిమ్రాన్‌జీత్ 6-5 తేడాతో ఉజ్బెకిస్తాన్ ఆర్చర్ అబ్దుసత్తోరోవా‌ను షూటౌట్‌లో ఓడించగా.. దీపిక కుమారి 7-1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కే చెందిన హమ్రోవాపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల కేటగిరీలో కుశాల్ దలాల్, ప్రథమేశ్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో కుశాల్ 149-146 తేడాతో అర్మిన్ పక్జాద్(ఇరాన్)పై, ప్రథమేశ్ 150-14 తేడాతో అక్బర్ అలీపై గెలుపొందారు. కాంపౌండ్ మహిళల కేటగిరీలో పర్ణీత్ కౌర్ 148-147 తేడాతో సహచర క్రీడాకారిణి ఆదితి‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో ప్రియ గుర్జార్ 142-145 తేడాతో ఫతేమె హెమ్మతి చేతిలో ఓడిపోయింది. ఫైనల్‌లో ఫతేమె హెమ్మతితో పర్ణీత్ తలపడగా.. కాంస్య పతకం కోసం ప్రియా, ఆదితి పోటీపడనున్నారు. రికర్వ్, కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్స్ ఆదివారం జరగనున్నాయి.

Advertisement

Next Story