సౌతాఫ్రికాకు అజిత్ అగర్కార్! ఎందుకంటే..?

by Swamyn |
సౌతాఫ్రికాకు అజిత్ అగర్కార్! ఎందుకంటే..?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొంతకాలంగా టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌‌తో ఆడిన సెమీస్ మ్యాచే వీరిద్దరికి చివరిది. అయితే, ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరూ ఆడాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది. రోహిత్, కోహ్లీ కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. వీరితో మాట్లాడేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ అక్కడికి బయలుదేరి వెళ్లనున్నాడు. మరో ఇద్దరు సెలెక్టర్లు శివ్ సుందర్ దాస్, సలీల్ అంకోలా ప్రస్తుతం కేప్‌టౌన్‌లోనే ఉన్నారు. టీ20ల్లోకి పునరాగమనంపై రోహిత్, కోహ్లీతో అజిత్ అగార్కర్ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ పర్యటన ముగియగానే భారత జట్టు సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 11 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే. అయితే, ఈ నెలలోనే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఉండటంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు రోహిత్, కోహ్లీ అందుబాటులో ఉంటారా? లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది. ఈ విషయంతోపాటు జట్టు ఎంపికపై అగార్కర్.. రోహిత్, కోహ్లీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో డిస్కస్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, అఫ్గాన్‌తో సిరీస్‌తోనే టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ఉండదని, ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేస్తారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్‌కు ముందు 30 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసి, లీగ్‌లో వారి ప్రదర్శనను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed