- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Disha : ‘దిశ’ ఐదేళ్ల ప్రస్థానం ఇదే.. మైలు రాళ్లు ఎలా సాధించామంటే..

2020 మార్చ్ 7న కరోనా కష్టకాలం ముంగిట దిశ దినపత్రిక ప్రారంభమైంది. డిజిటల్ పేపర్‌గా మొదలైనా, దినదిన ప్రవర్ధమానమై అనతికాలంలోనే ప్రింట్‌లోకి సైతం ప్రవేశించింది. వెనకాల ఏ పార్టీ, ఏ సామాజికవర్గం లేని మీడియాగా నిత్యం ప్రజల పక్షమే ఉంటూ అన్ని వర్గాల ఆదరాభిమానాలను అందుకుంటున్నది. వార్తలు ప్రచురించడంలో దినపత్రికల విశ్వసనీయతను, సోషల్ మీడియా వేగాన్ని పాటిస్తున్నది. బహుశా దినపత్రికల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డైనమిక్ ఎడిషన్లను ప్రారంభించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దమ్మున్న వార్తలను ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న కోట్లాది తెలుగు పాఠకులకు చేరువైంది.
సర్క్యులేషన్ లెక్కలను కొలవడానికున్న ఏబీసీ ఇప్పుడు నామమాత్రమైంది. ఆయా పత్రికలు సమర్పించే సీఏ సర్టిఫికేట్ మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాలకు, సంస్థలకు కొలమానంగా మారింది. దరిమిలా ఏ పత్రిక ఎన్ని కాపీలు అమ్ముడవుతోందని చెప్పడం ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జేబుల్లో ఉన్న మొబైల్‌లోనో, చేతిలో ఉన్న టాబ్లెట్‌లోనో, ముందున్న కంప్యూటర్‌లోనో పేపర్లను, వార్తల క్లిప్స్‌ను చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలు తెలియాలంటే డిజిటల్ వ్యూయర్షిప్‌ను చూడడమే మేలైన పద్ధతి. ఆ డిజిటల్ లెక్కల్లో దిశ అగ్రస్థానంలో ఉంది. రోజువారీగా వచ్చే వీక్షణల్లో, సోషల్ మీడియాలో వార్తల క్లిప్పుల వ్యాప్తిలో దిశను మించిన పేపర్ లేదనే విషయం అక్షరసత్యం.
దిశ పేపర్ సక్సెస్ తెలుగు మీడియాను ప్రజాస్వామీకరించింది. పదుల, వందల కోట్ల రూ.ల పెట్టుబడి పెడితే కాని పేపర్ తేలేమనే పరిస్థితులను మార్చేసింది. దిశ ఆదర్శంగా డజన్ల కొద్దీ, వందల కొద్దీ ఆన్‌లైన్/పీడీఎఫ్ పేపర్లు తెర పైకి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. తమ వార్తలు పది మందికి తెలియాలని కోరుకునే అన్ని వర్గాల ప్రజలకు, నాయకులకు వేదిక కల్పిస్తున్నాయి. వేలాది మంది రిపోర్టర్లకు, కంటెంట్ రైటర్లకు, సబ్‌ఎడిటర్లకు ఉపాధినిస్తున్నాయి. ఏ మీడియా సంస్థలో ఉద్యోగం కోల్పోయిన జర్నలిస్టు అయినా ఓ వెబ్‌సైటో, ఈ-పేపరో పెట్టుకుని బతికేయవచ్చుననే విశ్వాసాన్ని నేడు కలిగివుంటున్నాడంటే అది దిశ పుణ్యమేనని చెప్పక తప్పదు.
కుప్పలు తెప్పలుగా వచ్చిన పేపర్ల మూలంగా జర్నలిజం విలువలు దెబ్బ తింటున్నాయని కొందరు ఆందోళన చెందవచ్చు. అయితే, సోషల్ మీడియా చేస్తున్న పనినే డిజిటల్ పేపర్లు చేస్తున్నాయని వాళ్లు గుర్తించాలి. ప్రజలకు వాస్తవాలను చేరవేయడంలో, వార్తలపై గుత్తాధిపత్యాన్ని ధిక్కరించడంలో వాటి కృషిని అభినందించాలి. అందులో కొన్ని అనైతిక, అబద్ధపు వార్తలు రాస్తున్న మాట వాస్తవం. అలాంటి పేపర్లు కాలక్రమంలో విశ్వసనీయతను కోల్పోయి వాటికవే అంతరించక తప్పని స్థితి వస్తుంది. దిశ సక్సెస్ స్పిరిట్‌తో వచ్చిన అనేక చిన్న, పెద్ద దినపత్రికల్లో ఎన్ని పాఠకుల ఆదరణను పొందాయో పరిశీలిస్తే ఈ ఆందోళనకు అర్థం లేదని రుజువవుతుంది.
ఆరవ ఏట ప్రవేశించిన సందర్భంగా నిత్యం సత్యం వైపే ఉండాలన్న తన నిబద్ధతను దిశ మరోమారు ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా పాఠకులు నచ్చి మెచ్చేలా రూపం.. సారం.. విషయంలో మరిన్ని ప్రయోగాలు చేయాలని సంకల్పించింది. పాఠకులు, ప్రకటనకర్తలు, దాతలు, స్వతంత్ర మీడియా వర్ధిల్లాలని కోరుకునే పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యోగులు, విద్యావంతులు మమ్మల్ని ఎప్పటిలానే ఆదరించాలని, సహకరించాలని, సాయపడాలని విన్నవించుకుంటున్నాం.
వాస్తవమే మా గమ్యం.. గమనం..
ఇది మీ మీడియా.. మనందరి మీడియా..
టీ మోహన్‌రావు,
మేనేజింగ్ డైరెక్టర్
డి మార్కండేయ
ఎడిటర్