చరిత్రకు డిజిటల్ రక్షణ.. వందేళ్లైనా చెదిరిపోకుండా ఉండేలా చర్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-01 14:37:50.0  )
చరిత్రకు డిజిటల్ రక్షణ.. వందేళ్లైనా చెదిరిపోకుండా ఉండేలా చర్యలు
X

చరిత్ర కాలాన్ని బట్టి మారుతూనే ఉంటుంది. ఎన్ని సామాజిక మాధ్యమాలకైనా, చరిత్రను బోధించే టీచర్లకైనా, చరిత్రకారులకైనా సమాచారం పొందే సాధనాలు కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడో నిజాం కాలం నాటి కవులు, మేధావులు రాసినవైతే వాటిని అద్దాల్లో పెట్టిన పుస్తకాల రూపంలో చూసి తెలుసుకోవడం తప్ప ఇంకేం చేయలేం.. అవి పెయింటింగ్‌లైనా, పుస్తకాలైనా, కాగితపు దస్తావేజులైనా, మత గ్రంథాలైన ఇలా ఏవైనా సరే మనం తాకి చూసినా, చదివినా పాడైపోతాయి. అవసాన దశలో ఉన్న అమూల్యమైన, వెలకట్టలేని మాన్యుస్క్రిప్ట్‌లు పరిరక్షించడానికి తెలంగాణ పురావస్తు శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది, చారిత్రక వారసత్వ సంపద భావితరాలకు ఎంత ఉపయోగం అనే అంశాలపై దిశ ప్రత్యేక కథనం..

హెర్బల్ టెక్నాలజీతో పత్రాలకు రక్షణ:

హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో అమూల్యమైన మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లు, దస్తావేజులు, ఇతర కాగితపు పత్రాలను రక్షణకు సంబంధించి తెలంగాణ పురావస్తు శాఖ సంరక్షిస్తుంది.. ఈ పత్రాలను కొన్ని సందర్శకులకు ప్రదర్శిస్తూ, కొన్నింటిని స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు. అయితే ఈ పత్రాలలోని మెటీరియల్ గుర్తింపుకు మించి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. ఈ పత్రాలలో వివిధ కాలాల చరిత్ర, సమాజం, భాష, మతం, కాలిగ్రఫీకి సంబంధించిన సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుంది.. రాష్ట్ర రాజకీయ, సామాజిక, భాషా, మతపరమైన చరిత్రను పునర్నిర్మించడంలో ఈ సమాచారం చాలా సహాయపడుతుంది. అయితే, ఈ విభాగంలో ఉపయోగించిన పాత సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ కాలం ఉండదు కాబట్టి నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ కొత్త హెర్బల్ టెక్నాలజీతో పత్రాలను చికిత్స చేయడంలో మరియు కాగితపు పత్రాలను భద్రపరచడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంది, ఇది పత్రాల వ్యాలిడిటీ పెంచడమే కాకుండా అవి వంద సంవత్సరాల వరకు చెదిరిపోకుండా ఉండేలా సహాయపడుతుంది.

గతేడాది కుదిరిన ఒప్పందం

తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ పురావస్తు ప్రదర్శనశాలలోని అలనాటి మాన్యుస్రిప్ట్‌లు, చిత్రకళాఖండాలు, రాతప్రతుల మరమ్మతులు, పరిరక్షించడం, డిజిటలైజేషన్, డాక్యుమెంటేషన్, క్యాటలాగింగ్ కోసం ఢిల్లీలోని ఇస్తామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్(ఎన్ఐఎంఎఫ్ సీ) తో తెలంగాణ హెరిటేజ్ శాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఎన్ఐఎంఎఫ్ సీ డైరెక్టర్ డా.మహది ఖాజాపిరి, హెరిటేజ్ శాఖ డైరెక్టర్ భారతి హోళికేరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్, స్టేట్ ఆర్కైవ్స్‌తో సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సహకారం అందిస్తుంది. ఈ విభాగం, తెలంగాణలోని స్టేట్ మ్యూజియంలో ఉంచబడిన మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లు మరియు దస్తావేజుల మరమ్మతు, పరిరక్షణ, డిజిటలైజేషన్, డాక్యుమెంటేషన్, కేటలాగింగ్ కోసం నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్‌తో, న్యూఢిల్లీలోని నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.. ఈ అవగాహన ఒప్పందం గతేడాది ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లోని స్టేట్ మ్యూజియంలో జరిగింది. అప్పటి సాంస్కతిక,పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సమక్షంలో హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్ భారతి హోళికేరి, నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మెహదీ ఖాజే పిరి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

స్టేట్ మ్యూజియం

తెలంగాణ స్టేట్ మ్యూజియం 93 ఏళ్ల ఘనచరిత్ర కలిగి ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మ్యూజియంగా ప్రజలకు సుపరిచితమైన ఈ మ్యూజియాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియంగా నామకరణం చేశారు. 1931 లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ మ్యూజియాన్ని కట్టించాడు. ఒకప్పుడు టౌన్ హాల్‌లో ఉండే స్టేట్ మ్యూజియం ఇప్పుడు అసెంబ్లీ ఆవరణలోని పబ్లిక్ గార్డెన్స్‌కి తరలించారు. 1914 లో పురావస్తు శాఖ స్థాపించారు. అప్పట్లో హైదరాబాద్ మ్యూజియం అని పిలువబడే తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం మొదట 1927లో స్థాపించబడింది. ఈ మ్యూజియం అప్పుడు అసెంబ్లీ పక్కన పబ్లిక్ గార్డెన్స్ టౌన్ హాల్‌లో ఉండేది. 1930లో నిజాం దీనికి హైదరాబాద్ పేరు పెట్టారు. దీనికి నిజాం 1931 మార్చి 31న న అధికారికంగా ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం 1960లో ఈ మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు మ్యూజియంగా మార్చారు. అనంతరం 2009లో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేట్ మ్యూజియంగా మార్చారు. 2008లో నిజాంకు చెందిన కత్తి, ఇతర కళాఖండాలు మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం దీనిని తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియంగా మార్చారు.

కళాఖండాలు నిక్షిప్తం

మ్యూజియంలో అనేక గ్యాలరీలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఆకర్షణీయమైన సేకరణలను ప్రదర్శిస్తాయి. రాతి శిల్పాల నుండి ఆధునిక చిత్రాల వరకు, కాంస్య రచనలు, మాన్యుస్క్రిప్ట్‌లు, వివిధ రకాల వస్త్రాలు వరకు, తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం వివిధ రకాల చారిత్రక ఆసక్తిని కలిగి ఉన్న వస్తువులను ప్రదర్శిస్తుంది. మ్యూజియం అజంతా చిత్రాల అనుకరణలు వంటి ప్రత్యేకమైన సేకరణలను కూడా కలిగి ఉంది మరియు వీటిని కలిగి ఉన్న దేశంలోని ఏకైక మ్యూజియం ఇది. కాంస్య కళాఖండాలు, కవచం, రాతి శిల్పాలు, మాన్యుస్క్రిప్ట్‌లు, ఆధునిక చిత్రాలు, వస్త్రాలు మొదలైన వాటి గ్యాలరీ కూడా ఉంది. అదనంగా, మ్యూజియంలో బౌద్ధ శిల్పాల ప్రత్యేక గ్యాలరీ కూడా ఉంది. చాళుక్యుల కాలం మరియు విజయనగర కాలం నాటి హిందూ శిల్పాల విస్తృతమైన సేకరణ కూడా ఇక్కడ ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ముద్రతో పవిత్ర ఖురాన్ కాపీని కూడా ఇక్కడ ఉంచారు.

ఈజిప్టు మమ్మీ ప్రత్యేక ఆకర్షణ

స్టేట్ మ్యూజియంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణ ఈజిప్టు యువరాణి నైషు మమ్మీ దీనిని 1930లో దీనిని ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్ అల్లుడు అల్లుడు నజీర్ నవాజ్ జంగ్ హైదరాబాద్‌కు 2,353 సంవత్సరాల ఈజిప్టు మమ్మీ తీసుకువచ్చాడని చెబుతారు. అప్పట్లోనే ఈజిప్టు మమ్మీని నజీర్ నవాజ్ జంగ్ 1000 పౌండ్లకు కొనుగోలు చేశాడు. తరువాత దీనిని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు ఇవ్వగా, నిజాం దానిని మ్యూజియంకు విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు. భారతదేశంలో ఉన్న ఆరు ఈజిప్టు మమ్మీలలో ఒకటి స్టేట్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ. ఇది భారతదేశంలోని ఆరు ఈజిప్టు మమ్మీలలో ఒకటి కాగా, మిగిలినవి లక్నో, ముంబై, వడోదర, జైపూర్ మరియు కోల్‌కతాలో ఉన్నాయి. క్షీణిస్తున్న మమ్మీని 2016లో పునరుద్ధరించి ఆక్సిజన్ లేని బాక్స్ లో ఉంచారు. 19 వ శతాబ్దంలో స్టేట్ మ్యూజియంలో బస చేసిన నిజాం నవాబుకు తరుచుగా పీడ కలలు తరచూ వస్తుండడంతో హైదరాబాద్ మ్యూజియం వదిలి కింగ్ కోటి ప్యాలస్‌కు నిజాం మకాం మార్చాడు. స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన టిప్పు సుల్తాన్ వాడిన తల్వార్ కత్తిని వేరే స్టేట్ మ్యూజియం వాళ్లు కొనుగోలు చేసినట్లు సమాచారం..

ఘనమైన చరిత్ర మన సొంతం

ఆది మానవుతని కాలం నుంచి ఆధునిక యుగం వరకు ఉన్నతమైన చారిత్రక వారసత్వ సంపద కలిగిఉండడం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు కొనసాగించిన పాలన ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేసింది. వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, సంస్కతి సంప్రదాయాలు , ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు, వారసత్వ సంపదకు తార్కాణంగా చెప్పవచ్చు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కొ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణకు, దేశానికి గర్వకారణం. దోమకొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ కాంప్లెక్స్ లోని మెట్లబావికి యునెస్కో అవార్డు వంటివి సాధిస్తూ రాష్ట్రం ఘన వారసత్వ సంపదను ప్రపంచానికి చాటుతున్నది. గత ప్రభుత్వం విస్మరించిన తెలంగాణ చారిత్రక సంపద, ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని పునరుజ్జీవింపచేసి భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నది. తెలంగాణ చరిత్రకారులు, మేధావులు స్వచ్చందంగా చరిత్రను కాపాడుకోవడంలో తమ వంతు భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నారు.

చరిత్ర తెలుసుకుంటేనే మనుగడ సాధ్యం: లక్ష్మి, పురావస్తు శాఖ డైరెక్టర్

ఆయా ప్రాంతాల చరిత్ర, అక్కడి పరిస్థితులు, జీవన విధానం, చారిత్రక నేపథ్యం తెలిస్తేనే మనిషి మనుగడ సాధ్యమవుతుంది. జీవన విధానం మెరుగవుతుంది. దీనికి ఉదాహరణగా యునానీ లాంటి హాస్పిటల్స్ పాత కాలం నాటి పద్దతులను అనుసరించి చికిత్స అందించడమే ఇందుకు నిదర్శనం..చరిత్రను కాపాడడం కోసం ముందు తరాలకు అందుబాటులో ఉండేలా డిజిటలైజేషన్, పరిరక్షణ కోసం నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ తో గతేడాది ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగానే వారికి 323 మాన్యుస్క్రిప్ట్‌లు, 1414 లైబ్రరీ పుస్తకాలను అందజేసాము.. ఈ మాన్యుస్క్రిప్ట్‌ల పరిరక్షణ, సంరక్షణ మన సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడటానికి సహాయపడుతుంది. ఆర్కియాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేసే స్కాలర్స్‌కు, చరిత్రను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చరిత్రను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.

వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి: అరవింద్ ఆర్య, టార్చ్(టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్) కార్యదర్శి

కేంద్ర పురావస్తు శాఖ గుర్తింపు పొందిన కట్టడాలు తెలంగాణలో ఎనిమిది మాత్రమే ఉన్నాయి. మరిన్ని కట్టడాలను శాఖ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షించాలి..ఏపీలో 130 కి పైగా వారసత్వ కట్టడాలను కేంద్ర పురావస్తు శాక గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన కట్టడాలు దాదాపు 70 వరకు ఉన్నాయి. వాటన్నింటిని కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలి. కోట్ట సంవత్సరాల క్రితం మనుగడ సాగించిన జీవజాతుల శిలాజాలు(ఫాజిల్స్) రాష్ట్రంలో లభ్యమవుతున్నాయి. వాటి సంరక్షణ, పరిశోధన కోసం ప్రత్యేకంగా ఫాజిల్ పార్క్ నిర్మించాలని ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విన్నవించాం. మా వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

Next Story

Most Viewed