ప్రపంచ అందగత్తెలకు హైదరాబాద్ ఆహ్వానం.. ఎన్ని దేశాలనుంచి రాబోతున్నారంటే..?

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-06 16:31:31.0  )
ప్రపంచ అందగత్తెలకు హైదరాబాద్ ఆహ్వానం.. ఎన్ని దేశాలనుంచి రాబోతున్నారంటే..?
X

హైదరాబాద్‌ నగరమే భాగమతి అనే ఒక అందగత్తె పేరుమీద ఏర్పడింది. అందుకే అందాల పోటీలు హైదరాబాద్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. హైదర్ మహల్‌‌.. సుందర్ మహల్‌గా మారి మిస్ వరల్డ్ సెలబ్రేషన్స్‌కు స్వాగతం పలుకుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 72వ ఎడిషన్‌కు మన ముత్యాల నగరం ఆతిథ్యమిస్తూ.. ప్రపంచ అందగత్తెలను ఆహ్వానిస్తున్నది. - దాయి శ్రీశైలం

72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌ను వేదికగా ప్రకటించింది. 28 రోజుల పాటు ఈ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా జరుగనున్నాయి. ప్రారంభ వేడుకలు మే 4న జరిగితే గ్రాండ్ ఫినాలె మే 31న ఉంటుంది. అదేరోజు ప్రపంచ సుందరి ఎవరో తెలిసిపోతుంది. జరూర్ ఆనా తెలంగాణ అని తెలంగాణ సర్కారు, పర్యాటక శాఖ ఇచ్చిన పిలుపును అందుకొని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈసారి అందాల పోటీలకు హైదరాబాద్ వైపు మొగ్గు చూపింది. మిస్ వరల్డ్ 2025 థీమ్ బ్యూటీ విత్ ఎ పర్పస్. దీంట్లో భాగంగా చారిటబుల్ వర్క్.. సోషల్ రెస్పా్న్సిబిలిటీ మన బాధ్యత అని చాటిచెప్తారు.

ట్రాక్ రికార్డు

ఎన్నో గ్లోబల్ సమ్మిట్‌లకు.. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైదరాబాద్.. మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరో ప్రపంచ వేడుకలకు స్వాగతం పలుకుతోంది. టూరిజం శాఖ పిలుపునిచ్చినంత మాత్రాన అవకాశం ఇవ్వరు కదా.? మౌలిక సౌకర్యాలు.. ఆర్థిక వనరులు.. పర్యాటక స్థితి వంటివన్నీ చూస్తారు. ఈవెంట్ నిర్వహణ.. లాజిస్టిక్స్.. మార్కెటింగ్.. సాంకేతికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. సాంస్కృతిక వారసత్వం.. అంతర్జాతీయ ఈవెంట్‌ల ట్రాక్ రికార్డు బాగుంది. హెచ్ఐసీసీ.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ప్రపంచస్థాయి వేదికలు ఉండటం వల్ల ఈ అవకాశం సులభతరం అయ్యింది.

120 దేశాలు

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో దాదాపు 120 దేశాల అందగత్తెలు పాల్గొంటారు. ఆసియా నుంచి ఇండియా.. చైనా.. జపాన్.. మలేషియా.. ఫిలిప్పీన్స్.. వియత్నాం.. శ్రీలంక సుందరీమణులు పాల్గొంటున్నారు. ఆఫ్రికా నుంచి బోట్స్వాన్, కామెరూన్, కెన్యా, మారిషస్, నైజీరియా, దక్షిణాఫ్రికా, ట్యూనీషియా, జింబాబ్వే దేశాల యువతులు పాల్గొంటున్నారు. అలాగే అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చిలీ, డొమినికన్ రిపబ్లిక్, జమైకా, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరూ, ప్యూర్టోరికో, ట్రినిడాడ్, టొబాగో, యునైటెడ్ స్టేట్స్ బ్యూటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు.

నీ పేరేమిటి అందమా..?

120 దేశాల నుంచి హైదరాబాద్‌కు అందాల ప్రదర్శనకు వస్తున్నవారిలో అచే అబ్రహమ్స్.. లెసిగో చోంబో.. క్రిస్టినా పిస్కోవా.. యాస్మినా జైటౌన్.. జెసికా గాగెన్ వంటి బ్యూటీస్ ఉన్నారు. వీరిలో అచే అబ్రహమ్స్ అమెరికా ఖండం నుంచి ట్రినిడాడ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఆఫ్రికా ఖండం బోట్స్వానా నుంచి లెసిగో చోంబో ప్రాతినిథ్యం వహిస్తోంది. అలాగే చెక్ రిపబ్లిక్ నుంచి క్రిస్టినా పిస్కోవా పాల్గొంటుంది. యాస్మినా జైటౌన్ లెబనాన్.. ఇంగ్లండ్ నుంచి జెసికా గాగెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఫస్ట్ మిస్ వరల్డ్

1951 జూలై 29న ఫస్ట్ మిస్ వరల్డ్ పోటీలను ఇంగ్లండ్‌లో నిర్వహించారు. 26 మంది మాత్రమే ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ 26 మంది అందగత్తెల్లోనూ ఇంగ్లండ్ నుంచి పాల్గొన్నవారే ఎక్కువ. 22 ఏళ్ల స్వీడన్ బ్యూటీ ‘కికి హకాన్సన్’ టైటిల్‌ను గెలుచుకుంది. ఎరిక్ మోర్లీ ఈ వేడుకలను నిర్వహించగా మొదట ‘ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్’ వేడుకల్లో భాగంగా ‘ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్’ అని పిలిచేవారు. తర్వాత ‘మిస్ వరల్డ్’ అని పేరు మార్చి అప్పటి నుంచి ప్రతీయేడు నిర్వహిస్తు్న్నారు. 1952లో స్వీడన్ మోడల్ రాణి మే లూయిస్ ఫ్లోడిన్ అందాల కిరీటాన్ని గెలుచుకుంది.

మిస్ వరల్డ్ ఎందుకు.?

మిస్ వరల్డ్ పోటీలను కేవలం అందాల ప్రదర్శన కోసమే కాకుండా అంతర్లీనంగా సామాజిక అంశాన్ని జోడించి నిర్వహిస్తుంటారని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ అంటున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు చాటిచెప్పే అంశంగా భావిస్తారు. మహిళల్లో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాలు, దాతృత్వ గుణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా దేశాల సాంస్కృతిక నేపథ్యాలను ప్రతిబింబింపజేస్తారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వేదికగా భావిస్తారు. వీటితో పాటు మహిళా అభివృద్ధికి చిహ్నంగా ఈ పోటీలను భావిస్తారు.

నిర్వహణ ఎవరిది?

మిస్ వరల్డ్ అందాల పోటీని మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నది. దీని బాధ్యతలను జూలియా మోర్లీ చూస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలు, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతీ సంవత్సరం ఈ సంస్థ నిర్వహిస్తున్నది. అంతకుముందు ఈ బాధ్యతను జూలియా మోర్లీ భర్త ఎరిక్ మోర్లీ చూసుకునేవారు. 2000లో ఎరిక్ మోర్లీ మరణించడంతో ఆ బాధ్యతను జూలియా మోర్లీ చూసుకుంటుంది. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి దాదాపు $10- $15 మిలియన్ల ఖర్చు అవుతుందని ఒక అంచనా. దీనిని ఆతిథ్య దేశం స్పాన్సర్ల భాగస్వామ్యంతో భరిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

1. దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ పోటీల్లో ఎంపికయి ఉండాలి.

2. ప్రాథమిక రౌండ్లలో పాల్గొనాలి.

3. చారిటబుల్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు.

4. ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు.

5. పోటీదారుల మోడలింగ్‌లో అనుభవం చూస్తారు.

6. క్రీడలు.. ఫిట్‌నెస్ వంటి నైపుణ్యాలను చెక్ చేస్తారు. 7. సెమీఫైనల్స్ నిర్వహిస్తారు.

8. స్విమింగ్ నైపుణ్యాలూ చూస్తారు.

9. ఇంటర్వ్యూ చేస్తారు.

10. చివరిగా ఒక ప్రశ్న అడుగుతారు.

ఇండియాలో ఎన్నిసార్లు.?

1. బెంగళూరు (1996)

2. ముంబై (2000)

3. ముంబై (2009)

4. 2010 (కొన్ని కారణాల వల్ల రద్దు అయింది)

5. 2023 (షెడ్యూల్ అయ్యాక 2024కి వాయిదా పడింది)

6. 2024 (ముంబై)

ఇండియా టైటిల్స్

1. రీటా ఫారియా (1966) మిస్ వరల్డ్ కిరీటం కైవసం చేసుకుంది. తర్వాత డాక్టర్ అయింది.

2. ఐశ్వర్య రాయ్ (1994) మిస్ వరల్డ్ కైవసం చేసుకున్న రెండో ఇండియన్. తర్వాత గ్లోబల్ అంబాసిడర్ అయింది.

3. డయానా హెడెన్ (1997) మూడుసార్లు సబ్ టైటిల్ గెలుచుకుంది. మిస్ ఫొటోజెనిక్.. మిస్ బీచ్‌వేర్.. మిస్ వరల్డ్ పర్సనాలిటీ.

4. యుక్తాముఖి (1999) మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న నాలుగో భారతీయురాలు.

5. ప్రియాంక చోప్రా (2000) గ్లోబల్ సూపర్ స్టార్.. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్.

6. మానుషి చిల్లర్ (2017) ప్రియాంక చోప్రా తర్వాత 17 ఏళ్లకు మానుషి అందాల కిరీటాన్ని ధరించి భారత్‌కు పేరు తీసుకొచ్చింది.

ఏ అర్హతలు ఉండాలి.?

1. వయసు: 17-26 సంవత్సరాలు

2. వైవాహిక స్థితి: పెళ్లికాని యువతి

3. విద్య: ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమానం

4. భాష: దేశ భాష లేదా ఇంగ్లిష్

5. అందం: శారీరక ఆకర్షణ.. విశ్వాసం.

6. వ్యక్తిత్వం: కమ్యునికేషన్ స్కిల్స్

7. ప్రతిభ: మ్యూజిక్, డ్యాన్స్, ప్రశ్నలకు సమాధానం చెప్పే నైపుణ్యం.

8. దాతృత్వం: సామాజిక సేవలో నిబద్ధత

9. ఆత్మవిశ్వాసం: సొంతంగా ఆలోచించే.. ఎదిగే సామర్థ్యం.

10: అవగాహన: విభిన్న సంస్కృతుల పట్ల అవగాహన ఉండాలి.

విజేతకు ఇచ్చే బహుమతి?

1. మిస్ వరల్డ్ కిరీటం.

2. నగదు బహుమతి ($1 మిలియన్)

3. మోడలింగ్‌కు అవకాశాలు

4. బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రోగ్రామ్ ద్వారా సేవా కార్యక్రమాలకు మద్దతు

5. ఏడాది పొడవునా సీడ్ ఫండింగ్

6. లండన్‌లో విలాసవంతమైన అపార్ట్‌మెంట్

7. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు.

8. శిక్షణ.. వర్క్‌షాపుల నిర్వహణ

- 70వ మిస్ వరల్డ్ పోటీలు 2020లో జరగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా 2021కు వాయిదా పడ్డాయి.

- ఆ సంవత్సరమూ కొవిడ్ ప్రభావం ఉండటంతో 2022కి వాయిదా వేశారు.

- మార్చి 16, 2022న ప్యూర్టోరికోలోని శాన్ జువాస్‌లో 70వ మిస్ వరల్డ్ ఈవెంట్స్ జరిగాయి.

- పోలాండ్ సుందరి కరోలినా బిలావ్‌స్కా కిరీటాన్ని సొంతం చేసుకుంది.

- 71వ మిస్ వరల్డ్ పోటీలు మే 2023న యూఏఈ జరగాల్సి ఉండగా.. వేదికను ఇండియాకు మార్చడంతో 2024, మార్చి 9న ముంబైలో జరిగాయి.

- చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా ప్రిస్కోవా కిరీటాన్ని కైవసం చేసుకుంది.

- 2025 హైదరాబాద్‌లో జరుగనున్న పోటీల్లో అందాల కిరీటం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Next Story