Kumbh Mela: ఆఖరిఘట్టానికి మహా కుంభమేళా.. మళ్లీ 144 సంవత్సరాల తర్వాతే

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-25 11:54:17.0  )
Kumbh Mela: ఆఖరిఘట్టానికి మహా కుంభమేళా.. మళ్లీ 144 సంవత్సరాల తర్వాతే
X

ఆఖరిఘట్టానికి

మహా కుంభమేళా

- శివరాత్రి రోజున చివరి రాజస్నానాలు

- అదేరోజున మహాకుంభమేళా పరిసమాప్తం

- ప్రయాగలో అమృత స్నానాలకు ప్రత్యేక స్థానం

- మళ్లీ 144 సంవత్సరాలకు మహా కుంభ్

రోజూ చేసేది నిత్య స్నానం.

కారణంచే చేసేది నైమిత్తిక స్నానం.

తీర్థాదులు.. పుష్కరాలు.. కార్తీకమాసం.. మాఘ ఫాల్గుణాలలో చేసేది పుణ్య స్నానం.

పుణ్యస్నానాన్ని కామ్య స్నానం అనికూడా పిలుస్తారు.

విశేష ఫలాలను ఉద్దేశించి చేసేదే ఈ పుణ్య స్నానం.

చివరి ఘట్టానికి చేరుకున్న మహా కుంభమేళాలో కోట్లాది భక్తులు చేస్తున్న పుణ్య స్నానం చేస్తున్నారు.

శివరాత్రికి చివరి రాజస్నానంతో కుంభమేళా పరిసమాప్తమవుతుంది.

- దాయి శ్రీశైలం

హిందూ పురాణాల ప్రకారం.. ప్రజలు పాప విమోచనం పొందడానికి భగవంతుడు జలం, అగ్నిని అనుగ్రహించాడు. అగ్ని దహింపజేస్తుంది కాబట్టి జలంతో శాస్త్ర సమ్మతంగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. దీనినే స్నానం చేస్తారు. ప్రవహిస్తున్న నదిలో గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధూ, కావేరీ, జలేస్మిన్ సన్నిధింకురు అని పఠిస్తూ నీటిని దోసిట్లోకి తీసుకుంటారు. సంప్రోక్ష.. దేవస్య.. ఆత్మానం సంప్రోక్ష అని అంటూ మీద చల్లుకుంటారు. మూడుసార్లు మునుగుతారు. మహా కుంభమేళాలో జరుగుతున్నది ఇదే. ఈ పుణ్య స్నానం కోసమే కోట్లమంది వెళ్తున్నారు.

రాజస్నానం అంటే.?

మహా కుంభమేళా చివరి ఘట్టానికి చేరుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని రోజులు పొడగించాలనే అభ్యర్థనలూ వచ్చాయి. కానీ.. అలా పొడగించడానికి వీలుండదు. ఇది కచ్చితంగా 45 రోజుల పాటు జరిగే ఉత్సవం. భారతదేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు నదీ స్నానం చేయడానికి తరలి వస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. సాధారణంగా పుణ్య తిథుల్లో నదీస్నానం విశేషంగా చేస్తారు. మహా కుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్నే రాజస్నానం అంటారు. మహా కుంభమేళాలో పరమ పవిత్రమైన స్నానం అన్నమాట.

ఆరు రాజ స్నానాలు

మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజస్నానాలు ఉంటాయి. జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం నిర్వహించారు. రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజున జనవరి 14న జరిగింది. జనవరి 29 మౌని అమావాస్య రోజున మూడో రాజస్నానం జరిగింది. పవిత్రమైన వసంత పంచమినాడు ఫిబ్రవరి 3న నాలుగో రాజస్నానం నిర్వహించారు. ఇక ఐదో రాజస్నానం మాఘ పౌర్ణమి రోజున అంటే ఫిబ్రవరి 12న జరిగింది. కుంభమేళాలో ఆరు రాజస్నానాల్లో పాల్గొనడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయనీ.. సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రజల విశ్వాసం.

శివరాత్రికి ఆరో రాజస్నానం

ఐదు రాజస్నానాలు పూర్తయి ఆరో రాజస్నానం కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26కే వస్తుండటం.. అదేరోజు కుంభమేళా ముగింపు రోజు కావడంతో కొన్ని కోట్లమంది ప్రయాగ్ రాజ్‌కు వచ్చే అవకాశం ఉంది. రుషులు.. సాధువులు.. భక్తులు త్రివేణి సంగమంలో ఆరో రాజస్నానం ఆచరించి హిమాలయాలకు వెళ్లిపోతారు. మహాకుంభమేళా రావడమే 144 ఏండ్లకోసారి వస్తుంది. అదేరోజున శివరాత్రి రావడం.. ఆ సందర్భంగా కుంభమేళాలో స్నానమాచరించడం అరుదైన అవకాశంగా భక్తులు భావిస్తున్నారు.

అమృత స్నానం అంటే.?

రాజస్నానాన్నే అమృత స్నానం అని కూడా పిలుస్తారు. సముద్ర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని పొందడానికి దేవతలు.. రాక్షసులు 12 ఏండ్లపాటు యుద్ధం చేస్తారు. ఆ సమయంలో కలశం నుంచి అమృత బిందువులు పడినచోటే మహా కుంభమేళా జరుగుతుంది. కాబట్టీ అక్కడ స్నానం చేయడాన్ని అమృత స్నానంగా భావిస్తారు. అమృత స్నానం చేసేముందు నదీమతల్లికి నమస్కరించుకొని నది ఒడ్డున కొంత మట్టిని సేకరిస్తారు. నదికి నమస్కరిస్తూ లోపలికి ప్రవేశించి ఆ మట్టిని నదిలో కలుపుతారు. ముక్కుమూసుకొని మూడుసార్లు మునిగి దోసిలితో నీరు తీసుకొని సూర్యునికి అర్గ్యం ఇస్తారు.

త్రివేణి సంగమం వద్దనే

కుంభమేళా.. మహాకుంభమేళా ఏదైనా త్రివేణి సంగమం ఒడ్డున్నే ఈ రాజస్నానాలు చేస్తారు. గంగతో సహా అన్ని నదులు ఎక్కడో చోట కలుస్తాయి. అంటే నదులన్నింటికీ ఎక్కడో సంగమం ఉంటుంది. అన్ని నదులకు వాటి సొంత సంగమ ప్రాంతాలుంటాయి. అయితే వీటన్నింటిలో త్రివేణీ సంగమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగా.. యమునా.. సరస్వతీ అనే మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణీ సంగమం అంటారు. ఈ మూడు నదులూ ప్రయాగ్ రాజ్ లోని సంగం వద్ద కలుస్తాయి. కాబట్టీ ప్రయాగ్ రాజ్ వద్దనే రాజస్నానాలు చేస్తారు.

కుంభమేళా రకాలు.?

1. మహాకుంభ్

2. అర్ధ్ కుంభ్

3. పూర్ణ కుంభ్

4. మాఘ్ కుంభ్ మేళా

ఎప్పుడెప్పుడు.?

1. మహాకుంభ మేళా: 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12వ పూర్ణ కుంభమేళా తర్వాత ఇది వస్తుందని అంటారు. ప్రయాగ్ రాజ్‌లో మాత్రమే జరుగుతుంది.

2. అర్ధకుంభ మేళా: ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండు పూర్ణ కుంభమేళాల మధ్య ఇది జరుగుతుంది. హరిద్వార్.. ప్రయాగ్ రాజ్‌లలో దీనిని నిర్వహిస్తారు.

3. పూర్ణకుంభ మేళా: ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హరిద్వార్.. ప్రయాగ్ రాజ్.. నాసిక్.. ఉజ్జయిని అనే నాలుగు పవిత్ర ప్రదేశాల్లో ఎక్కడైనా చూడొచ్చు.

4. మాఘమేళా: ప్రతీ సంవత్సరం మాఘ్ మేళా నిర్వహిస్తారు. దీనిని ఛోటా కుంభమేళా అనికూడా అంటారు. ప్రయాగ్ రాజ్‌లో మాఘమాసంలో దీనిని నిర్వహిస్తారు.

మళ్లీ 144 ఏళ్లకే

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. భూమిపై ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపై అది 144 సంవత్సరాలతో సమానం. అంటే మహాకుంభ మేళాలో ఆఖరి రాజస్నానం మిస్ అయితే మళ్లీ 144 సంవత్సరాలకే ఛాన్స్ ఉంటుంది. ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

మహా కుంభమేళా చరిత్ర

- మహా కుంభమేళాకు 850 ఏండ్ల చరిత్ర ఉందంటారు.

- ఆదిశంకరాచార్యులు దీనిని ప్రారంభించినట్లు చరిత్రకారులు పేర్కొంటారు.

- సూర్యుడు.. బృహస్పతి సంచారాన్ని పరిశీలించి.. కుంభమేళా తేదీలను డిసైడ్ చేస్తారు.

- సూర్యుడు.. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లో కుంభమేళా జరుగుతుంది.

- సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో జరుగుతుంది.

- గురుగ్రహం వృషభరాశిలో.. సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగ్ రాజ్‌లో జరుగుతుంది.

- బృహస్పతి.. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది.

మహా కుంభమేళాలో అఖాడాలు.. సాధువులు బంగారు వెండి పల్లకీలు.. ఏనుగులు.. గుర్రాలపై కూర్చొని నదిలో స్నానం చేయడానికి వస్తారు. ఈ సమయంలో తమ శక్తి.. కీర్తిని ప్రదర్శిస్తారు. అందుకే ఈ స్నానాలను రాజయోగ స్నానాలు.. లేదా రాజ స్నానాలు అంటారు.

మహా కుంభమేళాలో ముందుగా నాగ సాధువులే స్నానం చేస్తున్నారు. వారి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వడం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. నాగ సాధువుల తర్వాతే సాధారణ భక్తులు సంగమంలో స్నానమాచరించారు. స్నానం చేసేటప్పుడు ఐదుసార్లు మునిగే నియమాన్ని పాటిస్తేనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

Next Story

Most Viewed