- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నోరురించే పులస.. ఏడాదికి ఒక్కసారే!
దిశ, వెబ్‌డెస్క్ : పులస. ఈ పేరు వింటేనే గోదావరి జిల్లాల ప్రజల నోరు ఊరుతుంది. ఇక సినీ, రాజకీయ ప్రముఖులైతే అర్రులు చాస్తారు. రుచిలో రారాజు ఈ చేపేనని చెబుతారు గోదావరి వాసులు. కిలో వేల రూపాయల ధర పలికే ఈ చేపను ఎంత బీదవారైనా జీవితంలో ఒక్క సారైనా రుచి చూడకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. తాళిబొట్టు తాకట్టు పెట్టైనా పులస పులుసు తింటారంటే దాని విలువెంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ చేప ఎక్కడ, ఎప్పుడు దొరుకుతుంది.. దీని అసలు పేరు ఏంటీ? ధర ఎంత? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
ఇది ఇలస ప్రత్యేకత
తూర్పు గోదావరి జిల్లాలో ఏడాదికి ఒక్కసారి దొరికే చేప పులస. కేవలం జూలై నుంచి అక్టోబర్ వరకు లభ్యమవుతుందీ చేప. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. దీని అసలు పేరు ఇలస. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించగానే రంగుతోపాటు పేరును కూడా మార్చుకోని ఇలసగా మారుతుంది. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం ఇవ్వి నదిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదకు ఎదరీగడం దీని ప్రత్యేకత. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. ఆ సమయంలోనే జాలరుల వలలో ఇవ్వి పడతాయి. పడగానే చనిపోవడం, రెండు రోజులైనా పాడవకుండ ఉండడం దీని ప్రత్యేకత. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. దీని వల్లనే దీనికి డిమాండ్ పెరుగుతోంది.
కళ్లు తిరిగే ధర దీని సొంతం
గోదావరిలో పెరిగిన పులస మహా గిరాకీ. ఎంతంటే ఎన్ని వేలైనా సరే పులస చేప కొనేంత గిరాకీ అనుకోండి. ఇప్పుడు పులస చేప కొనుగోలు చేయడం ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. పలానా వ్యక్తి పులస చేప కొన్నాడంటే.. అబ్బా ఎంత గొప్పోళ్లురా వాళ్లు అనేంతలా పులసకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రత్యేకంగా వర్షాకాలంలో గోదావరిలో పెరిగిన అరుదైన పులసల కోసం నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.
నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ తినే ఈ పులసలు ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారాయి. ఎంత రేటైనా సరే..ఫస్ట్ అసలు సిసలైన పులస దొరికితే చాలనుకునేవారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ పులసను తూ.గో జిల్లా పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసీపీ నేత రెండున్నర కిలోల చేపకు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది తక్కువ సంఖ్యలో లభ్యమైన ఈ పులసలకు కిలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలకడం విశేషం.
వేట అంత ఆషామాషీ కాదు..
గోదావరిలో ఈ పులస చేలను వేటాడడం అంత ఆషామాషీ ఏం కాదు. సాధారణ చేపల్లా గాలానికి, వలకో ఇవ్వి పడవు. తెల్లవారుజామున ఏటి మధ్యకు వెళ్లి వలలు ఏర్పాటు చేసుకుంటే సాయంత్రానికి ఒకటి, రెండు పడితే వాళ్లు అదృష్టమంతులే. వీటి వేట ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన సఖినేటిపల్లి, పి.గన్నవరం, రాజోలు, అయోధ్యలంక, పెదమల్లంక, బోడసకుర్రు, కరవాక, గోగన్నమఠం, గంటి, నారాయణలంక, కేదార్లంక, వానపల్లి, వాడపాలెం, అద్దంకివారిలంక, కోటిపల్లి, యానాం, గోడితిప్ప, ఓడలరేవు, జొన్నల్లంక, లంకలగన్నవరం, కె.ఏనుగుపల్లి, మానేపల్లి, నాగుల్లంక తదితర ప్రాంతాల్లో మత్య్సకారులు వేట సాగిస్తారు. ఇలా కోనసీమ వరకు 200 బోట్లలో 600 మంది వరకు పులసల వేటాడుతారు. ఈ యేడు గోదావరిఉగ్రరూపం దాల్చి వరదలు పొటెత్తడంతో ఏపీ ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది. మరో వైపు కరోనా విజృంభిస్తుండడంతో ధర కూడా ఎక్కువ పలకదని జాలరులు వేటకు మొగ్గు చూపలేదు.
ప్రత్యేకంగా పులస ఫెస్టివల్..
గోదావరి జిల్లాల్లో పులస చేపకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఇవ్వి చేపల మార్కెట్లకు కొత్త కళను తీసుకొచ్చాయి. ఎక్కువ డిమాండ్ ఉన్న చేపను ఎంతరేటయినా పెట్టి కొనడానికి వెనకాడటం లేదు ఈ ప్రాంతవాసులు. ఈ చేపల రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు తరలివస్తున్నారు. దీంతో చేపలమార్కెట్లు కిటకిటలాడుతన్నాయి. వీటి రుచి కోసం బంధువులు సైతం పండగలకు వచ్చినట్టే జూలై నుంచి అక్టోబర్ మధ్యన చుట్టరికం పేరుతో వచ్చి పులసను తిని పోతారంటే అతిశయోక్తి కాదు. ఈ సీజన్ లో ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి ఈ కూరను వండి సినీ, రాజకీయ ప్రముఖులకు పంపుతారు. కూర వండిన మరుసటి రోజు తింటే దీని రుచి పెట్టింపు ఉంటుందని పులస ప్రియులు చెబుతున్నారు. మీకు పులస రుచి చూడాలనిపిస్తుందా.. అయితే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే…!