వారి సేవలను చూసి పోలీసులే వాహనాన్ని సమకూర్చారు..

by Sridhar Babu |   ( Updated:2020-05-07 03:48:15.0  )
వారి సేవలను చూసి పోలీసులే వాహనాన్ని సమకూర్చారు..
X

దిశ, కరీంనగర్: స్పందించాలన్న తపన ఉంటే చాలు ఎలాగైనా సేవ చేయొచ్చని నిరూపించింది స్పందన వెల్ఫేర్ సొసైటీ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న తపనతో ఈ సంస్థ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా ఈ సంస్థ ప్రతినిధులు అవసరమైనవారికి రక్తదానం చేస్తూ వారిని ఆదుకుంటుంటారు. అయితే లాక్ డౌన్ కారణంగా చాలామందికి పట్టెడన్నం కూడా దొరకని పరిస్థితి దాపురించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని గమనించిన సంస్థ ప్రతినిధులు ఓ వైపున బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తూనే మరో వైపు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 45 రోజులుగా స్పందన సంస్థ చేస్తున్న సేవలను చూసి కరీంనగర్ పోలీసులే భోజనాలను తరలించేందుకు ఓ వాహనాన్ని సమకూర్చారంటే వారిలోని సేవాభావం ఏంటో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు.

నాణ్యతతో కూడిన భోజనం..

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, చేతిలో చిల్లిగవ్వ లేక కొట్టుమిట్టాడుతున్న వలస కూలీలు, నిరుపేదలకు, భిక్షాటన చేసేవారికి, ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్, ఇతరులు భోజనం దొరకక ఇబ్బందులు పడుతున్నారని గమనించిన స్పందన వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.. వారికి భోజనం అందించాలని నిర్ణయించారు. అనుకున్న విధంగా వారికి 45 రోజులపాటు రెండు పూటల నాణ్యతతో కూడిన భోజనం అందించారు. రోజుకి 600 నుంచి 650 మందికి అన్నదానం చేశారు. నగరంగలోని పేదలు, వలస కూలీలు, ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వీరి సేవను గమనించిన కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి వారికి సాయం అందించారు. సొసైటీ అధ్యక్షులు దూలం కళ్యాణ్ కుమార్, శశి గరిమెళ్ళ, బొమ్మ శ్రీనివాస్ గౌడ్, భేతి మహేందర్ రెడ్డి, నడిగోట్టు సాంబయ్య, రాజు, నాగరాజు శర్మ, అల్లరి మధు, రోహిత్ రెడ్డి, రాజు కలిసి స్వయంగా వంట చేసి ఆహారాన్ని పంపిణీ చేశారు.

గోవులు, కోతులకు కూడా..

మూగ జీవాలకు కూడా ఆహారం దొరకడం కష్టంగా మారిందని గమనించిన సంస్థ ప్రతినిధులు గోశాలలోని గోవులకు, కొండగట్టు, నల్లగొండ ఆలయాల్లో ఉండే కోతులకు కూడా ఆహారాన్ని అందించారు. అంతేకాదు కరీంనగర్ తో పాటు మెట్ పల్లి, నిజామాబాద్, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సొసైటీ నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం మరో విశేషం.

పోలీసుల బాసట

కరీంనగర్ లోని ప్రభుత్వ మాత, శిశు సంరక్షణ కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్న స్పందన వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు పోలీసులు కూడా తమ వంతు సహకారం అందించారు. వీరు నిత్యం భోజనాన్ని అందించడానికి వంటలను తరలించేందుకు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులే స్వచ్ఛందంగా వారికి ఓ వాహనం అప్పగించి అందులో వంటలను రవాణా చేసుకోవాలని సూచించారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పేదలకు కూడా భోజనం అందించేందుకు ఉపయోగించుకోవచ్చని తమకు అప్పగించారని సంస్థ ప్రతినిధి బొమ్మ శ్రీనివాస్ తెలిపారు.

Tags: Spandhana Welfare Society, Service Activities, Annadanam, Police, Dholla Srinivas

Advertisement

Next Story

Most Viewed