పాకిస్థాన్‌కు ఆడకపోవడం బాధాకరం: తాహిర్

by Shyam |
పాకిస్థాన్‌కు ఆడకపోవడం బాధాకరం: తాహిర్
X

దిశ, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 10 ఏండ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అలరించాడు. సుదీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగడానికి తన భార్య సుమయ్య దిల్బార్‌ ముఖ్య పాత్ర పోషించారని తాహిర్ చెప్పారు. తాను పుట్టి పెరిగిన పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం బాధిస్తుందన్నాడు. ఓ పాకిస్తాన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాహిర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 1998లో పాకిస్తాన్ అండర్-19, పాకిస్తాన్ ఏ జట్ల తరఫున తాహిర్ ఆడాడు. అప్పుడే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి భారత సంతతి మోడల్ సుమయ్య దిల్బార్‌ ప్రేమలో పడ్డాడు. 2005 వరకు పాకిస్తాన్‌లోనే ఉన్నా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. భార్య సుమయ్య పాకిస్తాన్ రావడానికి ఇష్టపడకపోవడంతో అతడే దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. తన భార్య సహకారంతో తిరిగి దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2010లో పౌరసత్వం రావడంతో దక్షణాఫ్రికా జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ విషయంపై తాహిర్ స్పందిస్తూ ‘ఆ సమయంలో పాకిస్థాన్‌ను వీడటం కష్టంగా అనిపించింది. దేవుడి దయ వల్ల దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం దక్కింది. ఈ విషయంలో క్రెడిట్‌ అంతా నా భార్య సుమయ్య దిల్బార్‌కే దక్కుతుంది’ అని తాహిర్ చెప్పుకొచ్చాడు. తాహిర్ కెరీర్‌లో 20 టెస్టులు, 107 వన్డేలు, 38 టీ20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Advertisement

Next Story