కొడుకులు ఇంట్లో.. పొలం గట్టున తల్లి!

by Anukaran |
కొడుకులు ఇంట్లో.. పొలం గట్టున తల్లి!
X

దిశ ప్రతినిధి, వరంగల్ :

కరోనా మహమ్మారి తల్లీకొడుకుల బంధాలను చెరిపేస్తోంది. మానవ సంబంధాలను మంటకలుపుతోంది. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తికి కరోనా సోకిందని కన్న బిడ్డలు వ్యవసాయ బావి వద్దనే వదిలేసారు.‌‌ అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రిలో చేర్పించాల్సింది పోయి అనాథలా వదిలేసారు. దీంతో ఆ అభాగ్యురాలు పంట చేలల్లో దీనంగా కాలం‌ వెళ్లదీస్తోంది.

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన మారబోయిన లచ్చమ్మ( 82)కు నలుగురు కుమారులు, ఒక కూతురు కలరు. ఇటీవల లచ్చమ్మ కరోనా బారిన పడింది. విషయం తెలిసిన కొడుకులు ఆ వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి నిర్లక్ష్యం చేశారు. తల్లిని ఆస్పత్రికి తీసుకెళితే తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోనని కర్ర సాయంతో నడిచే వృద్దురాలిని గ్రామంలోని పంట చేల వద్ద వదిలేసారు.

కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్న లచ్చమ్మ చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ దీనంగా కాలం‌ వెళ్లదీస్తోంది. తిండితిప్పలు లేకుండా తన కుమారుల కోసం ఎదురుచూస్తోంది. ఎలాంటి వసతులు లేని పంటచేను దగ్గర తల్లిని‌ వదిలి వెళ్లిన కొడుకుల తీరును గ్రామస్థులు తప్పుపడుతున్నారు. కన్నతల్లి అని చూడకుండా కొడుకులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed