‘సిరివెన్నెల’ పాట.. నిగ్గదీసే తూటా

by Shyam |   ( Updated:2020-05-20 08:01:39.0  )
‘సిరివెన్నెల’ పాట.. నిగ్గదీసే తూటా
X

సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ గేయ రచయితల్లో ఒకరు. చిన్న చిన్న పదాల అల్లికలోనే జీవిత సారాన్ని విడమరిచి చెప్పగలరు. ఇక ఆయన పాటల్లోని సాహిత్యం.. మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది, మాట.. మెదడును తొలుస్తుంది, మొత్తంగా శాస్త్రి గారి పాట.. మనసును ఆహ్లాదపరుస్తుంది. తొలి చిత్రం ‘సిరివెన్నెల’ కాగా.. ఆ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తెలుగు సినిమాకు గొప్ప సాహిత్య సంపదను అందించిన సీతారామశాస్త్రిని తలచుకుంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పాట..

‘నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం.. మారదు కాలం
దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం.. మారదు కాలం..’

ఈ అక్షరాలన్నీ నిత్య సత్యాలే. 1993లో విడుదలైన ‘గాయం’ సినిమాలోని ఈ పాటకు దాదాపు 17 ఏళ్లు గడిచినా సమాజంలో ఏ మాత్రం మార్పు లేదు.. రాలేదు.

సీతారామ శాస్త్రి గారి సాహిత్యాన్ని గమనిస్తే మనకు అర్థమయ్యేదొక్కటే.. ఆయన పదాలు తూటాలు.. ఆయన రచనలు మనిషి ఆలోచన మీద వేసే మంత్రాలు.. ఆయన కవిత్వాలు తెలుగు సాహిత్యానికి సొబగులద్దే ఆభరణాలు. కొత్త బంగారులోకం సినిమాలోని పాట విన్నాక.. పై వ్యాఖ్యలు నిజమే అనిపించక మానదు.

“నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా”

ఈ పదాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తి వింటే తప్పకుండా ఇట్టే నిర్ణయం తీసుకోగలడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తప్పకుండా ముందుకు సాగగలడు అనిపిస్తుంది.. ఆ పద సంపదకున్న గొప్పతనం అలాంటిది.

“పేరుకు ఇందరు జనం
పేరుకుపోయిన ఒంటరితనం
నరనరమున పిరికితనం
ప్రశ్నిస్తే జవాబు మనం”

నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమా కోసం ఆయన కలం నుంచి జాలువారిన ఈ నాలుగు లైన్లు.. ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటాయి అంటుంటారు నారా రోహిత్.

కాలంతోపాటు కలాన్ని, కలం నుంచి జాలువారే పదాల్ని అప్‌డేట్ చేయడంలో దిట్ట అయిన సీతారామశాస్త్రి .. తాజాగా “సామజ వరగమన నిను చూసి ఆగగలనా( అల వైకుంఠపురంలో), వస్తున్నా వచ్చేస్తున్నా (వి)..” లాంటి సాంగ్స్‌తోనూ అలరించారు. సాహిత్యంలో సరిగమలు పలికించే సీతారామ శాస్త్రి గారి మాటే పాటగా తరతరాలను అలరించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed