బంగారాన్ని దాటేసిన వెండి..

by  |
బంగారాన్ని దాటేసిన వెండి..
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నెల రోజుల కిందట అనగా జూలై 6న కిలో వెండి ధర రూ.49,600 ఉంది. అంటే రూ.50,000లోపు. అదే 3 నెలల కిందట అనగా మే 5న కిలో వెండి ధర రూ.41,000. కానీ, ఇప్పుడు కేజీ వెండి ధర ఎంతో తెలుసా? రూ.73,500. హైదరాబాద్‌లో అయితే కిలో వెండి ధర రూ.75,000 వైపు పరుగులు తీస్తోంది. బంగారం కన్నా భారీగా దూసుకుపోతోంది. కేవలం నెలరోజుల్లో కిలో వెండి 48శాతం పెరిగింది. అంటే సుమారు 50శాతం అన్నమాట. ఇక ఎంసీఎక్స్‌లో వెండి రేటు చూస్తే నెల రోజుల కిందట కిలోధర రూ.49,000 ఉండేది. ఇవాళ కిలో వెండి ధర రూ.75,000 దాటింది.

ఈ ఒక్క రోజే కిలో వెండిపై రూ.4,000 పెరగగా, బుధవారం రూ.2,000 పెరిగింది. రెండు రోజుల్లో కిలో వెండి రూ.6,000 పెరిగి రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.75,975 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారాన్ని మించి వెండి ధరలు పెరుగుతుండటం అందరినీ కలవరపరుస్తోంది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు.

కానీ, ఈసారి వెండికే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఆందోళన కరంగా ఉండటంతో విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్లు. దీంతో బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. ఓసారి చరిత్రలోకి తొంగి చూస్తే 2008 అక్టోబర్ నుంచి 2011 సెప్టెంబర్ మధ్య బంగారం 140శాతం పెరిగితే వెండి ఏకంగా 350శాతం పెరిగింది. ఇప్పుడు ఆ చరిత్ర రిపీట్ అవుతోంది. బంగారం కన్నా వెండి భారీగా పెరుగుతోంది.

బంగారం కన్నా వెండి ఎక్కువ పెరుగుతుందని నిపుణులు అంచనా వేసినా ఈ స్థాయిలో పెరుగుతుందని ఊహించలేకపోయామని చెబుతున్నారు. సిల్వర్ రూ.60,000 దగ్గరకు చేరుకోవచ్చని అనుకుంటే ఏకంగా రూ.75,000 మార్క్ దాటింది.


Next Story

Most Viewed