గిరిజన చట్టాలకు తూట్లు.. గిరిజనేతరులకు ప్లాట్లు

by Disha Web Desk 9 |
గిరిజన చట్టాలకు తూట్లు.. గిరిజనేతరులకు ప్లాట్లు
X

దిశ, ఖమ్మం,బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ మండలాల్లో రియల్ ఎస్టేట్ దందా కోరలు చాచింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులను టార్గెట్ చేసుకొని పచ్చని పంట పొలాలను అడ్డికి పావు సేరు అన్న చందంగా కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి అమ్మకలు సాగిస్తున్నారు. చుంచుపల్లి మండలం ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో భారీ వెంచర్ కి రూపకల్పన చేశారు కొంతమంది పెద్ద మనుషులు. గిరిజన చట్టాలను మట్టిలో కలుపుతూ తమ స్వలాభం కోసం పచ్చని పంట పొలాల మనుగడకి ప్రశ్నార్థకంగా మారుతున్నారు.

రైతుల అవసరాలను అదునుగా తీసుకున్న ఈ రియల్ వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసిన పొలాలను చదును చేసి ప్లాట్ల రూపంలో అమ్మకాలు చేస్తున్నారు. గిరిజన చట్టం అమలులో ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో సుమారు పదెకరాల భారీ వెంచర్ వేశారు. 1/70 గిరిజన చట్టం అమలులో ఉన్న ఈ ప్రాంతంలో అసలు ఎటువంటి వెంచర్లకు అనుమతి ఉండదు. ఒకవేళ వెంచర్ వేసి అమ్మకాలు, కొనుగోలు చేసినా అది చట్ట విరుద్ధం. ఒకవేళ గిరిజనులే కొనుగోలు చేస్తే గిరిజన చట్టం వారికి అమలులో ఉంది గనుక కొంతమేరకు వారు బయటపడే అవకాశం ఉంది. కానీ వెంచర్లో సుమారు 70శాతం ఫ్లాట్లను గిరిజనేతరులకు అంట గట్టి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు.

ఉద్యోగస్తులే టార్గెట్

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగస్తుల సంఖ్య అధికంగా ఉండటం గమనించిన ఈ రియల్ వ్యాపారస్తులు ఉద్యోగస్తులనే టార్గెట్ చేస్తూ పావులు కదుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వెంచర్ వైపు పెద్ద పెద్ద పరిశ్రమలు పడుతున్నాయని ఒక్కసారిగా భూమి ధర ఆకాశాన్ని అంటుతుందని ఈ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసినట్లయితే ఫ్యూచర్ లో కోటీశ్వరులు అవుతారని అనేక మాయ మాటలు చెప్పి ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు.ఫ్యూచర్ మీద పక్కా ప్లానింగ్ తో ఉన్న ఉద్యోగస్తులు మాత్రం ఈ భూమి కొనుగోలు చేస్తే ఏకంగా నాలుగింతల లాభం వచ్చి పడుతుందని అత్యాశకు పోయి కూడ పెట్టిన డబ్బంతా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన వారు గిరిజనేతరులు గనుక వారికి భూమి మీద ఎటువంటి హక్కు ఉండదని మరిచిపోతున్నారు.

అధికారుల పాత్ర ఎంత..?

చీమ చిటుక్కుమన్నా పసికట్టే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు సుమారు 10 ఎకరాల భారీ వెంచర్‌‌ను కనిపెట్టాలేకపోయారంటే ఆశ్చర్యం కలగక మానదు. 10 ఎకరాల భూమి చదును చేయాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఈ రెండు నెలల సమయంలో ఏ ఒక్క అధికారికి విషయం తెలవలేదా.. చదును చేసిన అనంతరం మూడు నెలల వ్యవధిలో అనేక ఫ్లాట్లు అమ్మకాలు జరిపినా అధికారులకు గిరిజన చట్టం గుర్తు రాలేదా? ఇంత జరుగుతున్నా అధికారుల యాక్షన్ లేదు.. రియాక్షన్ రాదు అని చుంచుపల్లి మండల వాసులు బాహాటంగానే చెబుతున్నారు. అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్ట చెప్పిన తర్వాతనే ఈ వెంచర్ రూపకల్పన చేశారని, గట్టిగా ఎవరైనా ఫిర్యాదులు చేస్తే రియల్ మాఫియాకు ఒక నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండల వాసులు చెబుతున్నారు. గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఈ వెంచర్ వేసిన వారిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..



Next Story

Most Viewed