- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TRS: టీఆర్ఎస్‌కు గడ్డుకాలం.. ఒక్కొక్కరుగా ‘కారు’దిగుతున్న నేతలు
దిశప్రతినిధి, మెదక్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియని పరిస్థితి. ఎవరు ఏ జెండా ఎత్తుకుంటారో ఎవరికి తెలుసు.. సరిగ్గా ఉద్యమ పార్టీకి ఉద్యమగడ్డ పై అదే పరిస్థితి వచ్చింది. ఉద్యమ పార్టీలో అధికారం అతికొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని భావించిన ఉద్యమ నాయకులు నెమ్మదిగా టీఆర్ఎస్‌ను వీడేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సిద్దిపేట ఉద్యమ పురిటిగడ్డపై ఒకరిద్దరు పార్టీని వీడగా.. పలువురు ప్రజాప్రతినిధులు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీన్ని చూస్తుంటే టీఆర్ఎస్‌కు రానున్న రోజుల్లో సొంత పార్టీ నాయకుల నుండి ఎదురీత తప్పదనిపిస్తున్నది.
సిద్దిపేట నుండే పతనం ప్రారంభం ..
టీఆర్ఎస్ పార్టీ పురిటి గడ్డ అయిన సిద్దిపేట నుండే పతనం ప్రారంభమైంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు సొంత గడ్డలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ సిద్దిపేట నుండే పుట్టి ఉద్యమం పేరిట ప్రజల్లోకి వెళ్ళింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారు. అదే కాకుండా రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న హరీశ్ రావు సైతం ఈ ప్రాంతానికి చెందిన వారే . దీంతో ఈ జిల్లాలో టీఆర్ఎస్‌కు ఎదురుండదు అని భావించారు. ఉద్యమ సమయంలో పార్టీ జెండాలు మోసిన వారికి ప్రస్తుతం పార్టీలో సరైన గుర్తింపు లభించకపోవడంతో పలువురు నాయకులు టీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేడర్‌లో సగం మంది కూడా సంతృప్తిగా లేరు. ఉద్యమ సమయం నుండి పార్టీ వెన్నంటే ఉన్నాం . ఇప్పుటికైనా ఓ నామినేటెడ్ పదవి రాకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఓపిక నశించింది. నెమ్మదిగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుందనే సంకేతాలు అందుతున్నాయి. అతి త్వరలో జిల్లా సీనియర్ నాయకులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌ను వీడనున్నారు.
ఒక్కొక్కరుగా రాజీనామా ..
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న రోజునే టీఆర్ఎస్ ఉద్యమ నేత, పార్టీ క్రియాశీల కార్యకర్త గుండు రవితేజ రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా పార్టీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే దుబ్బాక నియోజక వర్గానికి చెందిన ఆరుగురు సర్పంచులు టీఆర్ఎస్ పార్టీని వీడారు. దీపాయంపల్లి సర్పంచ్ లావణ్య, కోనాయిపల్లి కొత్త సురేందర్ రెడ్డి, ముత్యంపేట రాజు, లింగాయపల్లి దేవి యాదగిరి, లింగరాజుపల్లి కనకరాజు, తాళ్లపల్లి సర్పంచ్ గోపారి ప్రియాంకతో పాటు ధర్మారం ఎంపీటీసీ చెప్యాల శ్రీనివాసులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
వీరికి పార్టీ కండువా కప్పి మంత్రి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇదిలాఉండగా మరికొందరు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. సిద్దిపేట పట్టణానికి చెందిన నలుగురు టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, అర్బన్ మండలానికి చెందిన సర్పంచ్ భర్త పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గం జగదేవపూర్‌లోని ఎనిమిది మంది సర్పంచులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. గుర్తింపు లేని పార్టీలో ఉండటం కంటే పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వారు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా జిల్లా మంత్రి గా ఉన్న హరీశ్ రావు గత కొన్ని రోజులుగా హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజీ అయ్యారు. సిద్దిపేటకు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇది కూడా పార్టీ శ్రేణుల్లో నిరాశను కలిగిస్తున్నది. పైగా ఉద్యమ కాలం నుండి పార్టీ వెన్నంటే ఉన్న నాయకులకు సరైన గుర్తింపు నివ్వడంలో పార్టీ విఫలమవుతోంది. అందరికీ సరైన ప్రాధాన్యత కల్పించడం అధికార పార్టీకి కష్టతరంగా మారింది. పార్టీలు మారిన వ్యక్తులకు ఇస్తున్న ప్రాధాన్యం సొంత పార్టీ నేతలకు మంత్రి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది పార్టీని వీడుతున్నారు . ఇప్పటికైనా జిల్లా మంత్రి ప్రత్యేక దృష్టి సారించి పార్టీ నాయకులను కాపాడుకుంటేనే టీఆర్ఎస్‌కు భవిష్యత్ ఉంటుంది. లేదంటే ఇక టీఆర్ఎస్‌కు గడ్డు కాలం తప్పదు.