కళ్ల ముందే జీవచ్ఛవంలా కుమారుడు.. 22ఏళ్లుగా మంచానికే పరిమితం

by Sridhar Babu |
Sairam
X

దిశ, పాలేరు: నవమాసాలు మోసి.. బిడ్డకు తల్లి జన్మనిస్తుంది. వారు సొంత కాళ్లపై నిలబడేదాకా తండ్రి.. బాధ్యతను మోస్తాడు. ఎదిగొచ్చిన పిల్లలు ఏళ్లు గడుస్తున్నా.. అమ్మ ఒడిలోనో… నాన్న భుజంపైనో… ఆగిపోతే..? ఆ కన్నవారు పడే వేదన.. అంతా ఇంతా కాదు. పిల్లల అల్లరితో సందడిగా ఉండాల్సిన ఇంటిల్లిపాది… అచేతనంగా పడిఉన్న బిడ్డతో.. దీనావస్థలో గడిపితే… ఆ కుటుంబం వేదన వర్ణనాతీతం..! పిల్లల కష్టం చూడలేక… రెక్కల కష్టం సరిపోక.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు పాలేరుకు చెందిన దంపతులు..!

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన మణిగా నాగేశ్వరరావు, శైలజ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయిరాంకు 22 ఏళ్లు, చిన్న కుమారుడు గణిథ్ కుమార్‌కు ఆరేళ్లు. వీరిలో పెద్ద కుమారుడు పుట్టినప్పటి నుంచి మంచానికే పరితమయ్యాడు. తల్లిదండ్రులు నోటికి ఆహారం, పాలు అందిస్తేనే అతను బతికేది. తల్లిదండ్రులు సపర్యలు చేస్తూ, అతని సంరక్షణ చూసుకుంటున్నారు. తండ్రి నాగేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి కూడా ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఇక శైలజకు కొడుకు సాయిరాం బాధ్యతలు చూసుకోవడంతోనే సరిపోతుంది. ఇప్పుడు భర్త నాగేశ్వరరావు ఆరోగ్యం సహకరించకపోవడంతో వీరి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

Sai ram

సాయిరాంకు చికిత్స అందిస్తే ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు భారీగా ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపినట్లు దంపతులు వివరించారు. ఇప్పటికే రూ.15లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. కానీ వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. బాబు తోటి వాళ్లు సరదాగా గడుపుతుంటే.. తన బాబు కదలలేని పరిస్థితిని చూసి శైలజ కన్నీరు పెట్టుకుంటుంది. పుట్టుకతోనే అతను మంచానికే పరిమితమై కనీసం నోరారా అమ్మ అని కూడా పిలవలేడని, వయసుకు తగిన ఎదుగుదల లేక ఏళ్లుగా జీవచ్చవంలా ఉన్నాడని బోరున విలపించింది. అతనికి సపర్యలు చేస్తూ, కంటికి రెప్పలా చూసుకుంటున్నట్లు తెలిపారు.

తమకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని వాపోయింది. బాబును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు లేక సతమతమవుతున్నామని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని శైలజ వేడుకొంటుంది. దాతలు 9676729429 ఈ నెంబర్‌కు ఫోన్ ఫే చేయాలని వేడుకుంటుంది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed