‘దర్జాగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ ధరించాలి’

by Shyam |   ( Updated:2021-12-22 04:19:06.0  )
‘దర్జాగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ ధరించాలి’
X

దిశ, ఖానాపూర్: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించి రహదారి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని ఎస్ఐ తాజుద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ రహదారి 365 పై వాహన తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన హెల్మెట్, ఇతర పత్రాలు లేని వాహనాలకి అపరాధ రుసుము విధించారు. ద్విచక్ర వాహన దారులకు , పరిమితికి మించి ప్యాసింజర్‌లతో వెళుతున్న ఆటో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అతివేగం,మద్యపానం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలన్నారు.

తనిఖీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనచోదకులు ఫోటో ద్వారా ఫైన్ లు చలానా విధిస్తుండడంతో అతి తెలివి చూపిస్తున్నారనే విషయం గమనించడం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు నెంబర్ ప్లేట్ కనిపించకుండా ప్లాస్టర్ వేయడం, అక్షరాలను టాంపరింగ్ చేయడం ,ఫొటోలో రాకుండా పూల దండలు అడ్డుగా పెట్టడం,అనేక రకాలుగా వృధా ప్రయాసలకి సమయం వెచ్చించే బదులు హెల్మెట్ ధరిస్తే దర్జాగా ప్రయాణం సాగించవచ్చు అని సదరు వ్యక్తులకు హితబోధ చేశారు.

హెల్మెట్ బహుకరించిన ఎస్ఐ

హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఒకరికి స్వయంగా ఎస్ఐ తాజుద్దీన్ హెల్మెట్ బహుకరించి హెల్మెట్ ప్రాధాన్యత ని వివరించారు. దీంతో చుట్టుపక్కల ప్రయాణికులు కూడా ఎస్ఐ కౌన్సిలింగ్ ద్వారా ప్రభావితులై హెల్మెట్‌లు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అటు వైపుగా వెళుతున్న ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ ఎస్ఐ ని అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఇప్పటికే మండల ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న తాజుద్దీన్ తనదైన శైలితో వాహనాలపై పాత బకాయిలు వసూలు చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన వెంట పోలీస్ కానిస్టేబుల్,సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story