Drug Census: పంజాబ్‌లో డ్రగ్ సెన్సస్.. బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయింపు

by vinod kumar |
Drug Census: పంజాబ్‌లో డ్రగ్ సెన్సస్.. బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొదటి సారి డ్రగ్ సెన్సస్ (Drug census) నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు గాను బడ్జెట్‌లో రూ. 150 కోట్లు కేటాయించింది. ప్రతి ఇంటి నుంచి డ్రగ్స్‌కు బానిసైన వారి వివరాలను సేకరించనున్నారు. దీంతో మాదక ద్రవ్యాల వ్యాప్తిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో ప్రభుత్వం డ్రగ్స్ ప యుద్ధాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తెలిపారు. ‘వచ్చే ఏడాది పంజాబ్‌లో మొట్టమొదటి డ్రగ్ సెన్సస్ నిర్వహించాలని నిర్ణయించాం. పంజాబ్ ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిగతులపై డేటాను సేకరించడంతో పాటు, మాదకద్రవ్యాల ప్రాబల్యం, వ్యసనం నుంచి విముక్తి కేంద్రాల వినియోగం మొదలైన వాటిపై సమగ్ర డేటాను సేకరిస్తాం’ అని తెలిపారు.

మార్చి 1న పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాలపై యుద్ధం అనే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2,248 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 3,957 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అంతేగాక నిందితుల నుంచి 137.7 కిలోల హెరాయిన్‌తో సహా పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,36,080 కోట్ల బడ్జెట్‌ను చీమా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Next Story