టెస్టింగ్ కిట్ల కొరత.. ఆస్పత్రుల్లో కొత్త తిప్పలు

by Shyam |   ( Updated:2021-04-24 10:43:12.0  )
టెస్టింగ్ కిట్ల కొరత.. ఆస్పత్రుల్లో కొత్త తిప్పలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యాక్సిన్లకేకాదు టెస్టింగ్ కిట్లకు, సిబ్బందికి కూడా కొరత ఏర్పడింది. గతంలో ఎన్ని టెస్టులు చేయడానికైనా తగిన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, కిట్లు సమకూర్చిన ప్రభుత్వం ఇప్పుడు కొరతను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో 1,060 యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టింగ్ కేంద్రాలు, 80 ఆర్‌టీ-పీసీఆర్ టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అరవై ప్రైవేటు లాబ్‌లు కూడా ఉన్నాయి. ఒక్కో ప్రభుత్వ టెస్టింగ్ సెంటర్‌లో మొదట్లో ఎన్ని టెస్టులైనా చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రాపిడ్ టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడడంతో పరిమితులు విధించింది వైద్యారోగ్య శాఖ. ప్రతీ సెంటర్‌లో గరిష్టంగా 300 టెస్టులు మాత్రమే చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ కొరతను దృష్టిలో పెట్టుకున్న వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఎక్కడ లభ్యత ఉంటే అక్కడ కొని విమానాల ద్వారానైనా సమకూర్చుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

కింగ్ కోఠి ఆస్పత్రిలోనూ కొరతే..

జిల్లా కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని టెస్టింగ్ కేంద్రాల్లో మాత్రమే కాకుండా కింగ్ కోఠి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి లాంటి ప్రముఖ ఆస్పత్రుల్లోనూ టెస్టింగ్ కిట్లకు కొరత ఉంది. రాష్ట్రంలోనూ, హైదరాబాద్ నగరంలోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్లో ఉన్న వ్యక్తులు టెస్టులు చేయించుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ టెస్టింగ్ సెంటర్లలో మాత్రం నిరాశ ఎదురవుతోంది. కింగ్ కోఠి ఆస్పత్రిలో శనివారం బారులు తీరి నిల్చున్నవారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందరికీ టెస్టులు చేయలేని కారణంతో మరుసటి రోజుకు టోకెన్లు ఇచ్చి పంపతున్నారు వైద్య సిబ్బంది. ప్రజల సంఖ్యకు తగినన్ని కిట్లు లేకపోవడంతో వెనక్కి తిప్పి పంపాల్సి వస్తోందని సిబ్బందిలో ఒకరు వివరించారు.

కొన్ని సెంటర్లలో రోజుకు సగటున 300 కంటే ఎక్కువ టెస్టులు చేయవద్దంటూ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని సెంటర్లలో ఇది వందకు మాత్రమే పరిమితం చేశారు. లక్షణాలు ఉంటే మాత్రమే వారికి టెస్టులు చేయాలని, అందరికీ అవసరం లేదన్న కొత్త షరతును కూడా ఉన్నతాధికారులు విధించారు. ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్‘ పద్ధతిలో ముందు వచ్చినవారికి మాత్రమే టెస్టులు చేసి మిగిలినవారికి మరుసటి రోజు లేదా ఆ తర్వాతి రోజుకు టోకెన్లు ఇచ్చి పంపుతున్నారు.

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రి, నార్సింగిలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ తదితర అనేక టెస్టింగ్ కేంద్రాల్లో రెండు రోజుల తర్వాత మాత్రమే టెస్టింగ్ కోసం స్లాట్ దొరుకుతోంది. ప్రైవేటు లాబ్‌లలో చాలా రోజులుగా ‘స్లాట్ బుకింగ్‘ విధానం ఉన్నప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం తగినన్ని కిట్లు ఉన్నందున అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుటు కిట్లకు షార్టేజీ రావడంతో టోకెన్లు, స్లాట్ బుకింగ్ అనివార్యమైంది. రద్దీ ఎక్కువ కావడంతో చాలా మందికి మొబైల్ ఫోన్లకు మెసేజీలు కూడా రావడంలేదు. రిపోర్టులు కూడా నోటి మాటగానే చెప్పాల్సి వస్తోంది. టెస్టులు చేయించుకోడానికి గంటల తరబడి ఫీవర్ ఆస్పత్రి లాంటి సెంటర్లలో కూడా పడిగాపులు పడాల్సి వస్తోంది.

ఈ రద్దీని నివారించడానికి, టెస్టింగ్ కిట్ల కొరతను అధిగమించడానికి ఉత్పత్తి సంస్థల నుంచి భారీ స్థాయిలో కొనుగోలు చేయాలని వైద్యారోగ్య మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తక్షణావసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ దొరికితే అక్కడ కొని వెంటనే విమానాల ద్వారా రాష్ట్రానికి తరలించాల్సిందిగా వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

Next Story