ఎన్‌డీఏకు అకాలీదళ్ కటీఫ్

by Anukaran |   ( Updated:2020-09-26 20:16:59.0  )
ఎన్‌డీఏకు అకాలీదళ్ కటీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ స్వస్తి పలికింది. శనివారం సాయంత్రం కీలక కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ చీఫ్ సుఖ్‌బిర్ సింగ్ బాదల్ వెల్లడించారు.

శనివారం నాటి అత్యవసర భేటీలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారని, కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు ప్రమాదకరమైనవని, సాగును భ్రష్టుపట్టిస్తాయని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్న హామీని కేంద్రం ఇవ్వకపోవడం, జమ్ము కశ్మీర్ అధికారిక భాషలో పంజాబీని చేర్చకపోవడం, పంజాబీలు, రైతులకు వ్యతిరేక వైఖరిని అనుసరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పార్టీ కార్యకర్తలు, రైతులను సంప్రదించే ఎన్‌డీఏ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

అగ్రి బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీ దళ్ ఎంపీ, సుఖ్‌బిర్ సింగ్ సతీమణి హర్‌సిమ్రత్ కౌర్ గతవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రైతు వ్యతిరక చర్యల్లో భాగస్వామిగా ఉండాలనుకోవట్లేదని అప్పుడు ఆమె పేర్కొన్నారు. శిరోమణి అకాలీదళ్ అగ్రి బిల్లులకు తొలుత సమర్థించినప్పటికీ రైతుల గంభీరమైన నిరసనలతో నిర్ణయాన్ని మార్చుకుంది. సుదీర్ఘకాలం ఎన్‌డీఏలో కొనసాగిన శిరోమణి అకాలీదళ్ కంటే ముందు శివసేన, టీడీపీలు కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed