జనవరి నాటికి వ్యాక్సిన్ లభిస్తుంది : అదర్ పూనావాలా

by Shyam |
జనవరి నాటికి వ్యాక్సిన్ లభిస్తుంది : అదర్ పూనావాలా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, బ్రిటీష్ సంస్థ ఆశ్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ 2021, జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా బుధవారం చెప్పారు. భారత మార్కెట్ కోసం కొవీషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడు దశల పరీక్షలు కొనసాగుతున్నాయి. ‘భారత్, యూకేలలో జరుగుతున్న పరీక్షల ఆధారంగా వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని అదర్ పూనావాలా పేర్కొన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రస్తావించిన అదర్ పూనావాలా..కొవీషీల్డ్‌కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్‌ని కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటివరకైతే తమ సంస్థ 60 నుంచి 70 లక్షల మోతాదుల తయారీ లక్ష్యంగా ఉన్నట్టు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నెలకు కోటి మోతాదుల వ్యాక్సిన్‌లను తయారు చేయాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు.

Advertisement

Next Story