లాభాల స్వీకరణతో వరుస లాభాలకు బ్రేక్

by  |
లాభాల స్వీకరణతో వరుస లాభాలకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. గత నెల నుంచి ప్రతి వారం జీవితకాల గరిష్ఠ స్థాయిలను దాటుకుంటూ ర్యాలీ చేసిన సూచీలు నీరసించాయి. రికార్డులతో దూసుకెల్తున్న స్టాక్ మార్కెట్లకు మదుపర్ల లాభాల స్వీకరణ వల్ల నష్టాలు తప్పలేదు. ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు నష్టాలో మొదలవగా తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. ఇన్వెస్టర్లు చివరి వరకు లాభాలను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 143.62 పాయింట్లు కోల్పోయి 45,959 వద్ద ముగియగా, నిఫ్టీ 50.80 పాయింట్లు నష్టపోయి 13,478 వద్ద ముగిసింది. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు నీరసించాయి. ముఖ్యంగా రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ రంగాలు 1 శాతానికిపైగా బలహీనపడగా, ఫార్మా రంగం మాత్రమే స్వల్పంగా బలపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్ షేర్లు లాభపడగా, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.67 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed