దేశీయ మార్కెట్ల మరో రికార్డు.. 48 వేల మార్కు చేరిన సెన్సెక్స్!

by Shamantha N |
దేశీయ మార్కెట్ల మరో రికార్డు.. 48 వేల మార్కు చేరిన సెన్సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డుల జోరును కొనసాగించాయి. వరుసగా తొమ్మిదోరోజు గరిష్ఠ లాభాలను సాధించాయి. ముఖ్యంగా కొవిడ్-19 నియంత్రణకు కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని నిపుణులు భావిస్తున్నారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ధోరణిలో ఉండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో సెన్సెక్స్ తొలిసారి జీవితకాల గరిష్ఠం 48 వేల మార్కును సాధించగలిగింది. నిఫ్టీ సైతం ఇటీవల 14 వేల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 307.82 పాయింట్లు ఎగసి 48,176 వద్ద ముగియగా, నిఫ్టీ 114.40 పాయింట్లు లాభపడి 14,132 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 5 శాతంపైగా పుంజుకోగా, ఐటీ, ఆటో, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, ఎల్అండ్‌టీ, బజాజ్ ఆటో షేర్లు లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.02 వద్ద ఉంది. గత వారాంతం ఆటుపోట్లకు గురైన దేశీయ కరెన్సీ ఈ వారం మెరుగ్గా రాణించింది. ఉదయమ ప్రారంభమైన నేపథ్యంలో 19 పైసలు మెరుగుపడి రూ. 72.93 నుంచి మార్కెట్లు ముగిసే సమయానికి రూ. 73.02 వద్ద ఉంది. కరోనా వ్యాక్సిన్‌లకు కేంద్రం అనుమతి ఇచ్చిన తరుణంలో దేశీ కరెన్సీలో ఉత్సాహం పెరిగిందని కమొడిటీ మార్కెట్ల నిపుణులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed