కొనసాగుతున్న మార్కెట్ల దూకుడు!

by Harish |
కొనసాగుతున్న మార్కెట్ల దూకుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధమవడంతో సెన్సెక్స్ దూకుడు పెంచింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో రికార్డులను నమోదు చేసింది. దీంతో సూచీలు మరోసారి జీవిత కాల గరిష్ఠాలను దక్కించుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో పాటు ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు, అమెరికా ఆర్థిక ఉద్దీపనమైన అంచనాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా మార్కెట్ల జోరుకు దోహదపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 403.29 పాయింట్లు ఎగసి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.85 పాయింట్లు లాభపడి 13,682 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా రంగాలు పుంజుకోగా, ప్రభుత్వం రంగ బ్యాంకులు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, టైటాన్, టీసీఎస్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటాస్టీల్, బజాజ్ ఆటో, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.56 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed