మార్కెట్లను వెంటాడుతున్న కరోనా సెకెండ్ వేవ్ భయాలు

by Harish |
మార్కెట్లను వెంటాడుతున్న కరోనా సెకెండ్ వేవ్ భయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మరోసారి భారీ నష్టాలు తప్పలేదు. సోమవారం వచ్చిందంటే స్టాక్ మార్కెట్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. గత వారం సైతం ఇదే ధోరణిలో పతనమైన సూచీలు, ఈ సోమవారం కూడా భారీగా కుదేలయ్యాయి. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా సెకెండ్ వేవ్‌తో పాటు దేశీయంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తుండటం మార్కెట్లలో సెంటిమెంట్ దెబ్బతినడానికి కారణమయ్యాయి.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 882.61 పాయింట్లు కోల్పోయి 47,949 వద్ద ముగియగా, నిఫ్టీ 258.40 పాయింట్ల నష్టంతో 14,359 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా ఇండెక్స్ మినహాయించి మిగిలిన రంగాలు దిగజారాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఆటో, ఫైనాన్స్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, రియల్ట్రీ రంగాలు 2-4 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ 2 శాతానికి పైగా పడిపోయాయి.

దలాల్ స్ట్రీట్ నష్టాలు రూ. 3.44 లక్షల కోట్లు..

కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో ఇన్వెస్టర్ల సంపద ఉదయం ప్రారంభ సమయంలో రూ. 5.82 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వల్లే భారీగా మదుపర్ల సంపద పోయింది. అయితే, మిడ్ సెషన్ అనంతరం ఈక్విటీ బెంచ్‌మార్క్‌ల మద్దతుతో మార్కెట్లు ముగిసే సమయానికి పెట్టుబడిదారుల సంపద రూ. 3.44 లక్షల కోట్ల నష్టానికి పరిమితమయ్యాయి. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 202.27 లక్షల కోట్లకు పడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed