'మూడీ'గా మార్కెట్లు…41 వేల దిగువన సెన్సెక్స్!

by Harish |
మూడీగా మార్కెట్లు…41 వేల దిగువన సెన్సెక్స్!
X

ఆసియా మార్కెట్ల పతనంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. కోవిడ్-19(కరోనా వైరస్) భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం టెలికాం సంస్థల ఏజీఆర్ చెల్లింపులు వంటి పరిణామాలు సూచీల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 41 వేల దిగువకు చేరుకోగా, నిఫ్టీ 12 వేల కిందకు దిగజారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఐసిఐసీఇ బ్యాంక్ సూచీలు ఇవాళ్టి పతనానికి ప్రధాన కారకాలుగా మారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 237.44 పాయింట్ల నష్టంతో 40,818 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 75.70 పాయింట్లను కోల్పోయి 11,970 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో తొలి 30 సూచీల్లో నాలుగు మినహా మిగిలిన సూచీలన్నీ పతనంలోనే కొనసాగుతున్నాయి. కోటక్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా మాత్రమే లాభాల్లో కొనసాగుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకీ సూచీలు అత్యధికంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం తన భారత జిడిపి వృద్ధి అంచనాను 2019కి 60 బేస్ పాయింట్స్(బిపిఎస్) నుండి 5 శాతానికి తగ్గించింది. 2020కి 120 బిపిఎస్ నుండి 5.4 శాతానికి తగ్గించింది. ప్రస్తుత త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభించినప్పటికీ, తాము ఇంతకుముందు ఊహించిన దానికంటే నెమ్మదిగా ఉండొచ్చని మూడీస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను 2020కి 5.4%, 2021కి 5.8% గా సవరించినట్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed