దళిత బంధుకు చారగొండ ఎంపిక.. సర్వేపై స్థానికులు ఏమంటున్నారంటే.?

by Shyam |   ( Updated:2021-09-01 09:54:16.0  )
దళిత బంధుకు చారగొండ ఎంపిక.. సర్వేపై స్థానికులు ఏమంటున్నారంటే.?
X

దిశ, అచ్చంపేట/చారగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వ్యయ ప్రయాసలతో కూడిన ఈ పథకాన్ని అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.

ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రమే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు వస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని మరో నాలుగు మండలాలను దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు ఎంపిక చేశారు.

ఈ నాలుగు మండలాల్లో నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం ఎంపిక అయింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చంపేట నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన చారగొండ మండలాన్ని దళిత బంధు పథకం కింద ఎంపిక కావడానికి తన వంతు కృషి చేశారు. త్వరలోనే ఈ మండలానికి సంబంధించి దళిత కుటుంబాల సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

మండల జనాభా వివరాలు..

జిల్లాలోని చారకొండ మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32,655 మంది జనాభా ఉన్నారు. వీరిలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు 4,176 మంది ఉండగా, 1,242 ఇండ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనంగా మరో 15 వందలకు పైగా జనాభా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అన్ని రంగాలలో వెనకడుగే..

చారకొండ మండలంలో దళిత సామాజిక వర్గం ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొంతమంది హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. కొంతమంది నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు. అక్షరాస్యత, ఉద్యోగపరంగా మిగతా మండలాల కన్నా ఒకింత వెనుకబడే ఉన్నారు. ప్రభుత్వం దళిత బంధు ద్వారా అందజేసే పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ద్వారా దళితులు అనుకూలంగా ఉన్న వ్యాపారాలను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.

అమలుచేసి చూపుతాం..

దళిత బంధు పథకం అమలు చేస్తున్నామంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ చాలెంజ్‌గా తీసుకున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చారగొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయం. దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేసి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.

Minister Niranjan Reddy

కొత్త మండలంలో.. కొత్త ఉత్సాహం

కొత్తగా ఏర్పడిన చారగొండ మండలంలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పథకం అమలు కోసం మండలాన్ని ఎంపిక చేయడం వల్ల ప్రజల జీవితాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే అచ్చంపేట.

మా మండలం ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా..

దళితులు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా చారకొండ మండలం ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల సహాయం అందచేయడం చాలా సంతోషంగా ఉంది.

గతంలో దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ పథకంలాగా కాకుండా ఈ పథకాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరికీ అమలు చేయాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా చారగొండ మండలాన్ని ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభూత్వ విప్ గువ్వల బాలారాజుకు కృతజ్ఞతలు.
ఈర్లపల్లి పెద్ధిరాజు, సిర్సనగండ్ల, చారకొండ మండలం.

కూలి పనులు చేసుకునే వారికి ఉపయోగం..

చారకొండ మండల దళితులు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయారు. ప్రభుత్వం దళిత బంధు పథకం కింద ఈ మండలాన్ని ఎంపిక చేయడం ఇక్కడి దళితుల జీవితాల్లో కొత్త వెలుగుని తీసుకు వచ్చే అవకాశం కలగనుంది. కూలీనాలీ చేసుకుని బ్రతికే కుటుంబాలు మంచి వ్యాపారాలు చేసుకోడానికి అవకాశాలుంటాయి. చారగొండ మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు, ఇతర ముఖ్య నేతలకు ధన్యవాదాలు.
లక్ష్మయ్య, చారగొండ.

Advertisement

Next Story

Most Viewed