గాలి ధర రూ. 5 కోట్లు : హరీశ్‌రావు

by Anukaran |
గాలి ధర రూ. 5 కోట్లు : హరీశ్‌రావు
X

దిశ, సిద్ధిపేట: లాటరీ టికెట్ కొంటె లాభం వస్తదో రాదో తెలియదు.. కానీ మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుంది అని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజివి రామయ్య అన్నారు. సిద్ధిపేట అర్బన్ పార్క్ లో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించడం చాలా సంతోషం అని అన్నారు. అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నమని, సహజంగా మొలకెత్తిన మొక్క చాలా బలంగా పెరుగుతుందన్నారు.

చెట్టు కన్నతల్లి లాంటిందనీ, లాటరీ టికెట్ కొంటె లాభం వస్తదో రాదో తెలియదు.. కానీ మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుందన్నారు. నీటిలో చేప ఉన్నట్టుగా.. భూమిలో పండ్లు ఉన్నాయని, చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు.. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోందన్నారు. ప్రతి రోజూ 50 వేల హెక్టర్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతుందన్నారు. శాశ్వత ప్రాతిపదికన మనం బతకాలంటే.. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలన్నారు.

అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు సేవ చేసినట్టేనని, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మంచి గాలి వస్తుందన్నారు. ఇప్పటికే ఢీల్లీ లాంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ లేక కొనుక్కునే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. ఒక్కరోజు మనిషి పీల్చే గాలి 3 ఆక్సిజన్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ ఖర్చు 700 రూపాయలు, ఈ లెక్కన మూడు సిలిండర్లకు 2100 ఖర్చు అవుతుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ లెక్కన ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలసి వస్తుందన్నారు. కానీ, చెట్లు మాత్రం మనకు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాయన్నారు.

వనజీవి రామయ్య జీవితం అందరికి ఆదర్శనీయమని, ఆయన కోటికి పైగా మొక్కలు నాటారన్నారు. అడవుల్లో మనుషులు వెళ్లలేని చోట ఉన్న ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకే డ్రోన్ వినియోగిస్తున్నామన్నారు. సీడ్ బాల్స్ తో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లు నరికితే.. తెరాస ప్రభుత్వం అడవుల్లో మొక్కలు నాటి చెట్లు పెచుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed