షాపింగ్‌ మాల్స్‌లో భద్రత భ్రమేనా.?

by Shyam |   ( Updated:2021-03-17 09:09:56.0  )
షాపింగ్‌ మాల్స్‌లో భద్రత భ్రమేనా.?
X

దిశ, శేరిలింగంపల్లి: చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. సీసీ కెమెరాలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఏ మాల్ కు వెళ్లినా, ఏ చోట ఉన్నా మీరు అండర్ సర్వవైలెన్స్ అంటూ పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తింటాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ పడితే అక్కడ ప్రతీ వీధికి, కాలనీల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా, ఎలాంటి ఘటన చోటుచేసుకున్నా సీసీ కెమెరాల్లో రికార్డవుతుంది. అంతలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, అంతా సీసీ కెమెరాలు చూసుకుంటాయిలే అని భద్రతను లైట్ తీసుకుంటున్నారు. కామన్ చెకింగ్స్ కు మాత్రమే పరిమితమవుతూ సెక్యూరిటీ విషయంలో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ప్రమాదం జరిగితే తప్పా ప్రజల భద్రత ఎవరికీ పట్టదు. గతంలో నగరంలో ఉగ్రవాద చర్యలు చోటుచేసుకున్న సమయంలో భద్రత విషయంలో పోలీసులు అనేక సలహాలు, సూచనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా చెకింగ్స్, ప్రతీది క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పా ఎవరిని వదలలేదు. ఏ షాపింగ్ మాల్ కు వెళ్లినా, కాస్త పేరున్న షాప్ కు వెళ్లినా ఎన్నో రకాలుగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి వదిలే వారు. ఒకానొక దశలో ఈ చెకింగ్స్ సర్వసాధారణంగా మారాయి. వీటికి జనాలు కూడా అడ్డుచెప్పలేదు. మనకోసమే కదా భద్రత మంచిదేగా అని అందరూ సహకరించేవారు. అయితే రానురాను అంతా లైట్ అయిపోయింది. భద్రతను ఎవరూ పట్టించుకోవడం లేదు.

చెకింగ్స్ ప్లేస్ లో మాస్క్స్, శానిటైజర్స్

కరోనా స్టార్ట్ అయ్యాక ప్రజలు భద్రతమాటను పూర్తిగా పక్కన పెట్టేశారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పెద్దపెద్ద షాపుల్లో కనీస ఏర్పాట్లు కూడా కరువయ్యాయి. సెక్యూరిటీ కంటే కూడా మొహానికి మాస్క్, చేతులకు శానిటైజర్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాస్క్ లేదంటే మాల్, సినిమా హాల్ లోకి ఎంట్రీ లేదని పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రెన్స్ వద్ద శానిటైజర్ స్టాండ్స్ తప్పనిసరిగా ఉంచుతున్నారు. కానీ, భద్రతపరమైన చర్యలు మాత్రం కంటితుడుపుగానే కనిపిస్తున్నాయి. భద్రతపరమైన సమస్యలు తలెత్తితే పోలీసులు చూసుకుంటారు, సీసీ కెమెరాలు ఉన్నాయనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

భారం అంతా వాటిపైనే..

సీసీ కెమెరాల ఏర్పాటు అనేది సర్వసాధారణంగా మారింది. కిల్లీకొట్టు నుంచి స్టార్​హోటల్స్ వరకు, గల్లీగల్లీకి సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విషయంలో అందరిని హర్షించాల్సిందే. అయితే భద్రతను గాలికి వదిలి అన్నీ సీసీ కెమెరాలే చూసుకుంటాయిలే అని బాధ్యతమరవడం దారుణం. తక్కువ ధరలోనే సీసీ కెమెరాలు లభిస్తుండడం, పోలీసులు కూడా వీటి ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టడంతో చాలా కాలనీల అసోసియేషన్లు, షాప్స్ ఓనర్లు ఇలా ఎవరికి వారే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు అనేవి నిఘా పరంగా ఉన్నంతంగా నిలుస్తున్న తీరా ప్రమాదం చోటుచేసుకున్నాక వాటిని గమనించి అందులోని ఫీడ్ తీసుకుని కారకులను పట్టుకుంటే ప్రయోజనం ఎంటన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. అదే ప్రమాదం జరుగకముందే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తే ఆ ప్రమాదానికి ఆస్కారం ఉండదు కదా. కొన్ని షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ లో కనీస భద్రత కూడా కరువైంది. ఏదో పైపై చెకింగ్స్ కు మాత్రమే పరిమితమవుతున్నారు.

వేలాది సీసీ కెమెరాలు..

చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్ బీ పోలీస్​ స్టేషన్ల పరిధిలో పోలీసులు వేలాది కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే నేను సైతం అంటూ కాలనీల వారీగా ఆయా అసోసియేషన్లు సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక షాపుల వద్ద కూడా ఎవరికి వారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా కేవలం సీసీ కెమెరాల మీదనే భారం మోపి ఊరుకుంటే ప్రమాదాలకు ఆస్కారం ఉందని, వాటితో పాటు భద్రతను కూడా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.

Advertisement

Next Story

Most Viewed