రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు.. భైంసా ఘటన బాధాకరం

by Shyam |
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు.. భైంసా ఘటన బాధాకరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మహిళలకు భద్రత కరువైందని, భైంసాలో నాలుగేళ్ల బాలికపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటమే అందుకు ఉదాహరణ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పలు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం లోటస్ పాండ్ లో షర్మిలను కలిశారు. అందులో భాగంగా ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి న‌‌ల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు మిట్ట పురుషోత్తంరెడ్డి పలువురు కార్యకర్తలతో కలిసి వచ్చి ష‌ర్మిల‌కు త‌న మ‌ద్దతు తెలిపారు. ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు సంజీవ‌రావు సుమారు 200 మందికి పైగా నాయ‌కులతో లోటస్ పాండ్‌కు తరలివ‌చ్చి షర్మిలకు త‌న మ‌ద్దతిచ్చారు. ఇదిలా ఉండగా మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై ముఖ్య నేతలతో షర్మిల సమావేశమైనట్లు కార్యాలయవర్గం తెలిపింది.

షర్మిలను కలిసిన సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీకి చెందిన ఓబీసీ విద్యార్థి సంఘం నాయకుడు కిర‌ణ్ 15 మంది విద్యార్థులతో కలిసి ష‌ర్మిలను కలిసి త‌మ గోడును వెలిబుచ్చారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తమకు పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్‌ను అందించేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం పది వేల ర్యాంకులోపు వచ్చిన విద్యార్థుల‌కు మాత్రమే రీయింబ‌ర్స్‌మెంట్ అందిస్తోందని, అది కూడా ఎంతో ఆలస్యంగా మంజూరవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాగా రాష్ట్రంలో రాజన్న రాజ్యం త్వరలో రాబోతోందని, అప్పుడు పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ అందిస్తామ‌ని షర్మిల వారికి భ‌రోసానిచ్చారు.

కరీంనగర్ జిల్లా నాయకులతో ఆత్మీయ సమ్మేళనం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, వైఎస్సార్ అభిమానులతో షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తమ ప్రాంత సమస్యలతో పాటు సామాన్యుల కష్టాలను తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 1500 మంది నాయకులు తరలివస్తున్నారని షర్మిల కార్యాలయవర్గం స్పష్టం చేసింది.

ఖమ్మంలో సభకు పోలీసుల అనుమతి

ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు షర్మిల ఇప్పటికే తన అనుచరులను ఖమ్మం జిల్లాకు పంపించారు. అయితే పెవిలియన్, ఎస్సార్బీజీఎన్ఆర్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కొవిడ్ నిబందనలు కచ్చితంగా పాటించాలని వారు సూచించారు. ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించనున్న ఈ సభలోనే పార్టీ విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉండటంతో అందరి ఫోకస్ ఆ సభ మీద పడింది.

Advertisement

Next Story

Most Viewed