ఆ జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి.. సీటు కోసం నాయకుల పాట్లు

by Shyam |   ( Updated:2021-11-13 07:33:29.0  )
ఆ జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి..  సీటు కోసం నాయకుల పాట్లు
X

దిశ ప్రతినిధి, మెదక్ : మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా, మరోవైపు స్థానిక సంస్థల కింద ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహించనుండంతో సీటు సంపాదించేందుకు నాయకులు, ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు‌లని కలిసినట్టు సమాచారం. జిల్లాల పునర్విభజనతో ఏ జిల్లాకు దక్కుతుందనేది పెద్ద ఆసక్తిగా మారింది. సీఎం సొంత జిల్లాకు దక్కుతుందని కొందరు చెబుతుండగా, సిట్టింగ్ ఎమ్మెల్సీకే మళ్లీ సీటు దక్కే అవకాశం ఉందని సంగారెడ్డి నాయకులు ముచ్చటించుకుంటున్నారు. సీఎం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఉండటం మూలంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది.

లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ ..

ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ముగియనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంతకుముందు ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేసే స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఈ నెల 16 న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24 న నామినేషన్ల పరిశీలన, 26 న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 10 న పోలింగ్, 14 న కౌంటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

జిల్లాలో 1,154 మంది ఓటర్లు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,154 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో 386 కౌన్సిలర్లు ఉండగా, 67 జడ్పీటీసీలు, 713 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరందరు డిసెంబర్ 10 న జరిగే పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మెజార్టీ ప్రజాప్రతినిధులు అధికార టీఆర్ఎస్‌కు సంబంధించిన వారే.

రేసులో పలువురి పేర్లు ..

సీఎం సొంత జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పలువురు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో రెండు కోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీరవీందర్, దేశపతి శ్రీనివాస్ తో పాటు మరికొందరు నాయకులు టికెట్ ఆశిస్తుండగా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తో పాటు పైనున్నారు వారు సైతం ఆశిస్తున్నారు. వీరితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీరయ్య, వంటేరు ప్రతాప్ రెడ్డి, నందిని సిధారెడ్డి, పలువురు నాయకులు ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. ఇందులో చాలా మంది నాయకులు సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం పలుమార్లు వెళ్లినట్టు సమాచారం.వీరిలో ఎవరిని పదవి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed