ఆ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

by Harish |   ( Updated:2021-03-01 06:13:33.0  )
ఆ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: గృహ రుణాలను పొందాలనుకునేవారికి దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. గృహ రుణాల వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గృహ రుణాలకు 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే, రుణ మొత్తంతో పాటు సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు అమలవుతాయని, ఈ సదుపాయం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. రూ. 75 లక్షల వరకు రుణాలకు 6.70 శాతం వడ్డీ ఉంటుందని, అంతకుమించి తీసుకునే రుణాలకు 6.75 శాతం వడ్డీ వర్తించనున్నట్టు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజుపై 100 శాతం రాయితీ లభిస్తుందని, అలాగే, ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి గృహ రుణాన్ని తీసుకుంటే అదనంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీ అందించనున్నట్టు, ఈ నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రుణాలను తీసుకునే మహిళలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. ‘ తాజాగా తగ్గిన వడ్డీ రేట్లు దేశీయంగా ఎవరైనా గృహ రుణాలను తీసుకోవాలనుకునే వారికి ఉత్తమమైన ఎంపిక అని’ ఎస్‌బీఐ రిటైల్ బిజినెస్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సలోనీ నారాయణ్ చెప్పారు.

Advertisement

Next Story