ఐక్యతా మూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్

by Shyam |
ఐక్యతా మూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
X

దిశ, ముషీరాబాద్:
దేశాన్ని ఏకం చేసిన ఐక్యతా మూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ క్యాంపు కార్యాలయంలో శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ తో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… స్వతంత్ర భారతదేశంలో ఐదు వందల సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి పటేల్ అని గుర్తు చేశారు. ఆయనే లేకపోతే చరిత్ర గతి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించాలని అని చెప్పారు. సైనిక చర్యతో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేశారని అన్నారు. ప్రభుత్వం ఆయనను విస్మరించడం సరికాదన్నారు. వారి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు భవారీలాల్ వర్మ, వెంకట్ రెడ్డి, మేకల సారంగపాణి, యాదగిరి గౌడ్, భరత్ గౌడ్, సి కే శంకర్, ముషీరాబాద్ అసెంబ్లీ బీజేపి కన్వీనర్ రమేష్ రామ్, నాయకులు శివముదిరాజ్, రవి చారి, వెంకటేష్, జగదీష్, రామ్ రెడ్డి, మహేందర్ బాబు, కృష్ణ, రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed