ఆత్మగౌరవ నినాదం ఎంచుకున్న సర్దార్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై విశ్వాసం..!

by Sridhar Babu |
ఆత్మగౌరవ నినాదం ఎంచుకున్న సర్దార్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై విశ్వాసం..!
X

దిశ, పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమ పార్టీలో ద్రోహులకే ప్రాధాన్యత దక్కుతోందని కరీంనగర్ మాజీ మేయర్, ఎమ్మెల్సీ రెబల్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి పదవులు కట్టబెడుతూ నిజమైన ఉద్యమకారులను సీఎం విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా టికెట్లు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరూ ఉద్యమకారులు కాదని రవీందర్ సింగ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో మెయింటనెన్స్ బ్యాచ్ నడుస్తోందని.. ఈ బ్యాచ్ ఏది చెబితే అదే నడుస్తోందన్నారు.

ఎంపీటీసీలకు ఒక్క కుర్చీ కూడా కొనివ్వని అధికార టీఆర్ఎస్ పార్టీకి కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తున్నారా అని సర్దార్ ప్రశ్నించారు. వీరికి కనీసం శిక్షణ ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేయని తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు మాత్రం శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. తాను రెబల్‌గా పోటీ చేయడం వల్లే ఎంపీటీసీలకు గుర్తింపు లభించిందన్నారు. హుజూరాబాద్‌లో ఎంత డబ్బు ఖర్చు చేసినా అక్కడి ప్రజలు ఎలా తిరగబడ్డారో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆత్మగౌరవంతో చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వనున్నారని రవీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story