మున్ముందు సగం జీతాలు కూడా కష్టమేనంట!

by Shyam |
మున్ముందు సగం జీతాలు కూడా కష్టమేనంట!
X

దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్టీసీకి నెలవారీ నిర్వహణ వ్యయం భారమవుతోంది. సడలింపుల్లో భాగంగా గడిచిన 26 రోజులుగా జిల్లాల్లో బస్సులు తిరగడం ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఉద్యోగులకు ఇప్పట్లో పూర్తి జీతాలిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న 50 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి 50 శాతం వేతనాలనే యాజమాన్యం చెల్లించింది. నిజానికి ఆర్టీసీకి నెల వారీగా ఉన్నఖర్చుల్లో ఉద్యోగుల జీతాల ఖర్చే ఎక్కువ. ప్రతి నెలా రూ.240 కోట్ల దాకా ఉద్యోగుల జీతాలకే ఖర్చు పెడుతుంటుంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో బస్సులు తిరగక, తిరుగుతున్నవాటిలో డీజిల్ ఖర్చులు మాత్రమే తిరిగి వస్తుండడంతో ఉద్యోగుల జీతాల్లో సగం అంటే రూ.120 కోట్లనే ఆర్టీసీ చెల్లిస్తోంది. కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లో తెలగాణ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 77 శాతం దాకా ఉండేదని, సడలింపులు ఇచ్చిన తర్వాత మే 19వ తేదీ నుంచి 26 రోజులుగా ఇది సగటున 40 శాతం కూడా దాటడం లేదని అధికారులు వాపోతున్నారు. ఆర్టీసీకి ఉన్నమొత్తం 10 వేల బస్సులు తిరిగితే సంస్థకు ప్రతి రోజు టికెట్ల మీద వచ్చే ఆదాయం రూ.12 కోట్ల దాకా ఉంటుంది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం బస్సులు తిరగడం ప్రారంభమైన తొలి రోజు కేవలం 28 శాతం ఆక్యుపెన్సీ రేషియో, కోటి నుంచి రూ.రెండు కోట్ల మధ్యలో రెవెన్యూ వచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూలోనూ బస్సులు తిరగొచ్చొంటూ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఓఆర్ కొంత మేర పెరిగి రోజు రూ.3 నుంచి రూ.4 కోట్ల దాకా ఆదాయం వస్తోంది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు బస్సులు మినహాయిస్తే మొత్తం 6 వేల బస్సుల దాకా ప్రస్తుతం నడవాల్సి ఉంటుంది. అయితే ప్రజలు కరోనా భయంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటుండడంతో ఓఆర్ భారీగా పడిపోయి కేవలం 5 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. నిజానికి సగం బస్సులు తిరిగితే రూ.5 కోట్ల దాకా రోజు ఆదాయం రావాల్సి ఉండగా ప్రయాణికులు తగినంత లేకపోవడంతో కోటి, రెండు కోట్లు తక్కువగా వస్తోంది.

జీతాలకూ మరింత అప్పు తప్పదా?

మార్చి నెలలో మూడో వంతు రోజులు బస్సులు తిరిగినందున ఆ నెలలో వచ్చిన ఆదాయం నుంచే ఏప్రిల్, మే నెలల్లో సగం జీతాలకు సర్దుబాటు చేసినట్లు సమాచారం. ఇక జూన్ నెలలో చెల్లించిన మే నెల జీతం కోసం మాత్రం బ్యాంకుల నుంచి తాత్కాలిక రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి మున్ముందు ఇలాగే కొనసాగితే ప్రతి నెలా ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల దగ్గర మరింత అప్పు చేయక తప్పదని అధికారులు చెబుతున్నారు. ఈ అప్పులు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్టీసీకి లోన్స్ అడ్వాన్సెస్ కింద కేటాయించే నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్నరూ.400 కోట్లు భవిష్యత్తులో రెట్టింపు అవ్వొచ్చని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ తనకు ఉన్న రూ.2000 కోట్ల అప్పునకు ఏడాదికి రూ.180 కోట్ల దాకా వడ్డీ చెల్లిస్తోంది. నెలకు లెక్కేస్తే రూ.15 నుంచి 20 కోట్ల దాకా వడ్డీకి ఖర్చవుతోంది. కొత్త అప్పులు పుట్టాలంటే ఈ వడ్డీ డబ్బులు సకాలంలో చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్నట్లు డీజిల్ డబ్బులు మాత్రమే తిరిగి వస్తే పాత అప్పులకు వడ్డీలు తిరిగి చెల్లించడానికి కూడా ప్రభుత్వమే సహాయం చేయాల్సి ఉంటుందని సంస్థలో కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

చార్జీలు పెంచక తప్పదా..

పూర్తిస్థాయి లాక్‌డౌన్ పరిస్థితుల్లో దాదాపు రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల వసూళ్లు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో 40 శాతంలోపే ఓ‌ఆర్‌తో బస్సులు నడుపుతున్నసంస్థ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.240 కోట్లు (50 శాతం చెల్లిస్తే రూ.120 కోట్లు) జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం ఎంత వరకు ముందుకొస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకు గ్యారంటీలతో అప్పులు చేసుకునేందుకు ఆర్టీసీకి అనుమతులిచ్చినా ఒక్క జీతాలకే 3 నుంచి 4 నెలలకు రూ.500 కోట్లు కావాలి. ఆ తర్వాత ఓఆర్ పెరిగి ఆదాయమైనా పెరగాలి లేదంటే బస్సు చార్జీలను నిర్వహణ ఖర్చులకు తగ్గట్టు పెంచడమే సంస్థ ముందున్న ప్రధాన మార్గాలుగా కనిపిస్తున్నాయి. లేదంటే సంస్థ మనుగడే సందిగ్ధంలో పడనుందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సమ్మె అనంతరం చార్జీలు పెంచినపుడు మంచి ఫలితాలు వచ్చి ఆర్టీసీ ఆదాయం, ఖర్చులు సమానమయ్యాయని, కరోనా వచ్చి సంస్థ పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొచ్చిందని వారు చెబుతున్నారు. అంతర్ రాష్ట్ర బస్సులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని అవి స్టార్టైతే కొంత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మరో 2 నెలల తర్వాత కానీ ఆర్టీసీ బస్సుల పూర్తి ఓ‌ఆర్ ఎంత ఉంటుందనేది క్లారిటీ రాదని, అది స్పష్టం అయిన తర్వాత ప్రభుత్వ తుది నిర్ణయాన్నిబట్టి చార్జీల పెంపు ఉంటుందా? ఉండదా? అనేది తెలుస్తుందని వారంటున్నారు.

Advertisement

Next Story