మాట తప్పిన ‘సజ్జనార్’.. ఆదాయమున్నా ఉద్యోగులకు వేతనాల్లేవ్!

by Anukaran |   ( Updated:2021-09-14 04:17:02.0  )
rtc md sajjanar
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. దాదాపు 49 వేల మంది కార్మికులకు ఇంకా వేతనాలు జమ కాలేదు. ప్రతిరోజూ వేతనం కోసం ఎదురుచూస్తున్నారు. చేతిలో పైసలున్నా వేతనాలు విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం వెనకాడుతోంది. వేతనాలకు కూడా సీఎం ఆదేశాలు రావాలంటూ సాకులు చూపిస్తున్నారు. ప్రతినెలా 1వ తారీఖునే వేతనాలు ఇస్తామంటూ ఆర్టీసీ ఎండీగా నియామకమైన సజ్జనార్​ ప్రకటించిన తొలి నెలలోనే వేతన కష్టాలు కొనసాగుతున్నాయి.

కార్మికుల కష్టాలు..

ఆర్టీసీ కార్మికులకు 14వ తేదీ వచ్చినా జీతాలు అందలేదు. సగం నెల దాటినా జీతాలు రాకపోవడం ఇటీవల సాధారణంగా మారింది. గత నెలలో మాత్రం ఆర్టీసీ కార్మికుల జేఏసీ వేతనాల కోసం డిపోల ముందు ఉద్యమించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏడో తేదీ నాటికి విడుదల చేశారు. కానీ, మళ్లీ ఇప్పుడు పాత పంథాలోనే ఉన్నారు. వేతనాలు రాక కార్మికులు, ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. చేతిలో పైసల్లేక బయట అప్పులు దొరక్క కుటుంబపోషణ కోసం సతమతమవుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక, కిరాణ సామాను తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత నుంచే ఈ పరిస్థితి మారుతూ వస్తోంది.

2019 ఆగస్టు వరకు సాధారణంగా ఒకటో తేదీనే ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు వేసేవారు. ఒకటో తేదీన సెలవుంటే ముందు రోజే శాలరీస్‌ పడేవి. కానీ 2019 ఆర్టీసీ సమ్మె తర్వాత పరిస్థితి మారింది. ఒకటో తేదీ పోయి ఐదో తేదీ వచ్చింది.. ఆ తర్వాత 10వ తేదీకి చేరింది. ఇప్పుడు ఏకంగా 14వ తేదీ దాటినా జీతాలు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేవు. ఆర్టీసీలో పనిచేస్తున్న వారిలో కిందిస్థాయి మధ్య తరగతి కుటుంబాలే. దాదాపు 70 శాతం మంది కార్మికులకు జీతాలు రూ.25వేలలోపే ఉన్నాయి. ఇప్పుడు వేతనాలు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఈఎంఐ చెక్కులు బౌన్స్​అవుతున్నాయి. అధిక ఫైన్లు పడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు బంగారం తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు.

పైసలున్నా అంతేనా..?

వాస్తవానికి ఆర్టీసీ ఖాతాలో ఇప్పుడు వేతనాలకు సరిపడాకు మించి నిధులున్నాయి. ఇటీవల బ్యాంకు అప్పు రూ. 500 కోట్లు విడుదల చేశారు. ప్రతినెలా 8.22 శాతం వడ్డీతో మంజూరైన అప్పును ఇంకో బ్యాంకులోని ఖాతాల్లోకి మళ్లించి నిల్వ చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి నిల్వ చేసి మిత్తి చెల్లిస్తున్నారు. ఆగస్టులో ఆర్టీసీ ఆదాయం కూడా రూ. 303 కోట్లకు చేరింది. మొత్తంగా ఆర్టీసీ చేతిలో ఇప్పుడు రూ. 800 కోట్ల నిధులున్నాయి. కానీ, వీటిని బ్యాంకు ఖాతాల్లో నిల్వ చేసి చోద్యం చూస్తున్నారు. ప్రస్తుత నెల ఆర్టీసీకి రూ.124 కోట్లు వేతనాలకు ఇవ్వాల్సి ఉంది. కానీ, రూపాయి కూడా బయటకు తీయడం లేదు.

సీఎం చెప్పాల్సిందేనట..?

ఈ నిధులపై అధికారులు, మంత్రి విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. అప్పుగా వచ్చిన రూ. 500 కోట్లను ఎందుకు వాడుకోవాలనే విషయంలో ఎటూ తేల్చుకోవడం లేదు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సీసీఎస్, ఇతర బకాయిల కోసం వాడుదామంటూ గతంలో అధికారులు నివేదించారు. కానీ, హైర్ బస్సుల కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మంత్రి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు వర్గాల మధ్య పంచాయితీ ఎటూ తేలడం లేదు. ఈ ఫైల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపించామంటున్నారు. సీఎం నుంచి అనుమతి వస్తేనే నిధులను బయటకు తీస్తామంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల వేతనాలు కూడా సీఎం నిర్ణయంపైనే ఆధారపడినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Next Story