ఆర్టీసీ డిపోల మూసివేతపై చైర్మన్ బాజీ రెడ్డి క్లారిటీ..

by Shyam |
ఆర్టీసీ డిపోల మూసివేతపై చైర్మన్ బాజీ రెడ్డి క్లారిటీ..
X

దిశ, కంటోన్మెంట్ : తెలంగాణలో ఆర్టీసీ బస్ డిపోలను మూసివేయడం జరగదని ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్దన్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బాజీరెడ్డి స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గోవర్దన్ మాట్లాడుతూ.. రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. రక్తం నిలువలు తక్కువగా ఉన్నందున పౌరులు ప్రాణాలను కొల్పేయే పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో రక్తదాన శిబిరాలను నిర్వహించాలని ఇటీవలే రెడ్ క్రాస్ సోసైటీ ప్రతినిధులు సంస్థ ఎండీని కోరినట్లు తెలిపారు.

కరోనా ప్రభావం ఉన్న సమయంలో రక్తం అందుబాటులో లేనందున అనేక మంది బాలింతలు, రోడ్డు ప్రమాద బాధితులు మృతి చెందారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు సంస్థ ఉద్యోగులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క ఆర్టీసీ డిపోను మూసి వేయడం లేదని, ఉద్యోగులు ఎవరూ కూడా ఆధైర్యపడొద్దని గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రక్తదాన శిబిరం ద్వారా 160 యూనిట్లు సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ యుగంధర్, అధికారులు జగన్, కవిత, జానకి రాములు, జోత్స్నలతో పికెట్, కంటోన్మెంట్ డిపోల మేనేజర్లు సురేష్, కృష్ణమూర్తి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోయిన్ పల్లి మార్కెట్ మాజీ ఛైర్మన్ టిఎన్.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed