ఆర్టీసీ డ్రైవర్ అత్యుత్సాహం.. వరద నీటిలో చిక్కుకున్న బస్సు(వీడియో)

by Sridhar Babu |   ( Updated:2023-03-14 07:39:16.0  )
ఆర్టీసీ డ్రైవర్ అత్యుత్సాహం.. వరద నీటిలో చిక్కుకున్న బస్సు(వీడియో)
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ సమీపంలో సోమవారం సిద్దిపేట డిపో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు గంభీరావుపేట మండలంలోని పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో సిద్దిపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గంభీరావుపేట- లింగన్నపేట గ్రామాల మీదుగా ప్రయాణీకులతో బయలుదేరింది. లింగన్నపేట సమీపంలోని మినీ బ్రిడ్జ్‌పై నుంచి మానేరు వాగు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ఉధృతి ఉన్నా లెక్క చేయని డ్రైవర్‌ బస్సును వంతెనపైకి తీసుకెళ్లి వాగు దాటించే ప్రయత్నం చేశాడు.

అయితే, ప్రవాహ ఉధృతికి బస్సు వంతెన చివరి అంచు వరకు వెళ్లి ఆగింది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా భయంతో కేకలు వేయడంతో పరిసరాల్లోని రైతులు అక్కడికి చేరుకొని వరద ఉధృతిలో చిక్కుకున్న బస్సును గమనించి అప్రమత్తమయ్యారు. వరదలో చిక్కుకున్న ప్రయాణీకులను కాపాడేందుకు వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న తాళ్లను తీసుకెళ్లారు.

ఈత వచ్చిన రైతులు బస్సు వరకు వెళ్లి తాడు సహాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమని, సకాలంలో స్థానికులు రాకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రయాణీకులు మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed