వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ.50కోట్లు ఇవ్వండి

by Shyam |
వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ.50కోట్లు ఇవ్వండి
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణలో వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ. 50కోట్లు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. మంగళవారం ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాగునీటి రాకతో తెలంగాణ సాగు స్వరూపం మారిపోయిందన్నారు. దేశంలోనే అత్యధికంగా వేరుశనగ దిగుబడి వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వస్తుందన్నారు. హెక్టారుకు 1611 కిలోల దిగుబడి వస్తుందని వెల్లడించారు.సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో తెగుళ్లను తట్టుకుని నిలబడే నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించడంలో తోడ్పాటునందించాలన్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతికి అవకాశముండే వేరుశనగ పండించేందుకు వనపర్తిలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆప్లాటాక్సిన్ లేని వేరుశనగకు విదేశాలలో మంచి డిమాండ్ ఉందని, దీని నుంచి ఉత్పత్తి చేసే పీనట్ బట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ల్యాబ్‌, నూతన భవనం కోసం కేంద్రం నుంచి రూ.50 కోట్లు ఇవ్వాలని కోరారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం సహకరించి నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రైతులకు ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

Tags: peanuts reserch centre, funds release, agriculture minister niranjan asked to central minister thomar

Advertisement

Next Story

Most Viewed