- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేవ కాదు వ్యాపారం.. శవాన్ని ప్యాక్ చేయాలంటే రూ.4 వేలు ఇవ్వాల్సిందే!
దిశ, ములుగు : కరోనా కష్టకాలంలో పేదలకు ముందుండి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిలో కొందరు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అయినవారు దూరమై పుట్టెడు దుఖఃంలో ఉన్నా డబ్బులు డిమాండ్ చేస్తూ దిగజారుతున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో బుధవారం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ములుగు ఏరియా ఆస్పత్రిలో నాలుగు రోజుల కిందట చేరింది. కరోనాతో బాధపడుతున్న ఆమెకు ఇక్కడి ఐసోలేషన్ సెంటర్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె బుధవారం ఉదయం మరణించింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆస్పత్రికి వచ్చారు. అయితే, మృతదేహాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్యాక్ చేసి అంబులెన్స్‌లోకి ఎక్కించాలంటే రూ.4 వేలు ఇవ్వాల్సిందిగా అక్కడి సిబ్బంది డిమాండ్ చేశారు.
తమ వాళ్లను కోల్పోయి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే సిబ్బంది డబ్బులు అడగడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బంధువు ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, మానవత్వం ప్రదర్శించాలని వేడుకున్నారు. ఎన్నో అనాథ శవాలను డబ్బులు తీసుకోకుండానే ప్యాక్ చేసి పంపిస్తున్నాం.. వైరస్ ఉందని తెలిసి కూడా రిస్క్ తీసుకుంటున్న మాకు డబ్బులెందుకు ఇవ్వరని ఆ సిబ్బంది దబాయించినట్లు సమాచారం. వేరే విభాగంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారని తమను తాము సమర్థించుకుంటున్నారు. చివరకు రూ.3 వేలు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మృతురాలి బంధువులు ఎంతోకొంత చేతిలో పెట్టి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లె ను వివరణ కోరగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.