‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తి చిత్రం కాదు : చిత్ర యూనిట్

by Shyam |
‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తి చిత్రం కాదు : చిత్ర యూనిట్
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు జక్కన్న చెక్కుతున్న అఖండ వెండితెర శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం వేచిచూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం గురించి చిన్న అప్‌డేట్ వచ్చినా చాలు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలెట్టడంతో పాటు ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియోను దసరా కానుకగా ఇస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేయగా, దానికి అనూహ్య స్పందన వచ్చింది.

ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ చేతులు కలిపినట్లుగా ఉంది. లోగోలో రెండు చేతులు ఒకదానితో ఒకటి కలిసి యునైటీకి చిహ్నంగా నిలుస్తున్నాయి. అయితే ఈ పోస్టర్‌పై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. ఇది దేశభక్తి చిత్రమని, అల్లూరి, కొమురం భీమ్‌లు కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడతారని.. నెటిజన్లు తమవైన ఆలోచనలు, ఊహాగానాలతో కథ అల్లేస్తున్నారు. దీనిపై ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పందిస్తూ.. ‘‘ఆర్‌ఆర్ఆర్‌’లో ఎన్టీఆర్‌, చరణ్‌లు కలుసుకుంటారు. ఆ ఫొటోలో కనిపిస్తున్నవి వారి చేతులే. కానీ ఇది దేశభక్తి సినిమా కాదు, ఫిక్షనల్‌ మూవీ’ అని మరోసారి స్పష్టం చేసింది.

ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కు జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed