బొమ్మ అదుర్స్.. కేసీఆర్‌కు ఇక ‘RRR’ ధమాకా షురూ

by Anukaran |   ( Updated:2021-11-02 22:26:27.0  )
బొమ్మ అదుర్స్.. కేసీఆర్‌కు ఇక ‘RRR’ ధమాకా షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 24,068 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో మంగళవారం బీజేపీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, డ్యాన్సులు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ‘కేసీఆర్.. అసెంబ్లీలో నీకు డబుల్ ఆర్(రాజాసింగ్, రఘునందన్) చుక్కలు చూపిస్తున్నారు.

హుజురాబాద్ ఎన్నికల తరువాత మరో ఆర్(రాజేందర్) వస్తున్నాడు. ప్రగతి భవన్ ముందు నీకు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు నిజం చేసి చూపించారు. రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ ఫొటోలు ఒకవైపు బండి సంజయ్ ఫొటో మరోవైపు పెట్టి ‘ట్రిపుల్ ఆర్’ లోగోలతో ఫ్లెక్సీలు రెడీ చేసి ర్యాలీగా ప్రగతి భవన్ ఎదుట తిరుగుతూ హల్ చల్ చేశారు. కాగా అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ నేతలను అక్కడ నుంచి పంపించారు.

నిన్నటిదాకా మంత్రి, నేడు అపోజిషన్‌లో..

అసెంబ్లీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూపించడం కన్ఫామ్ ​అయింది. హుజురాబాద్​ బైపోల్‌లో ఈటల రాజేందర్​ గెలుపుతో ఇది సాధ్యమైందని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ​ఒక్కరే గెలుపొందారు. అనంతరం దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రఘునందన్​రావు గెలుపొందారు. ఇదిలా ఉండగా హుజురాబాద్ ​ఉప ఎన్నికల్లోనూ రాజేందర్ ​గెలిస్తే అసెంబ్లీలో అధికార పార్టీకి చుక్కలు చూపించడం ఖాయమని నాయకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో రాజాసింగ్, రఘునందన్​రావు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వీరికి రాజేందర్​తోడైతే బీజేపీకి ఎదురుండదనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్​ఆర్​ఆర్​ పేరిట రాజేందర్, రాజాసింగ్, రఘునందన్​రావుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట్లో తెగ వైరల్ ​అవుతున్నాయి.

ఈటల మాటల తూటాలు పేల్చేనా..?

మంత్రి పదవికి ఈటల రాజీనామా చేయడం, టీఆర్ఎస్ ​నుంచి బీజేపీకి మారడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి ఈటల గ్రాఫ్‌ను ​తగ్గించేందుకు టీఆర్ఎస్ ఎంతో శ్రమించింది. ఎన్నికలను ఆలస్యం చేస్తే బైపోల్‌లో ఈటలను ఓడించడం సులభమని సైతం ప్రణాళికలు చేసింది టీఆర్ఎస్. ఈటలను ఓడించేందుకు దళితబంధు పథకాన్ని సైతం ప్రవేశపెట్టింది. అయినా టీఆర్ఎస్‌కు చేదు అనుభవం తప్పలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ హుజురాబాద్​ బైపోల్ ​ప్రచారంలో టీఆర్ఎస్‌కు అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్​ సినిమా చూపిస్తామని వ్యాఖ్యలు చేశారు.

ఈటల గెలుపొందడంతో ఆర్ఆర్ఆర్ ​సినిమా చూపించడం కన్ఫామ్ అయిందని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ.. హుజూర్​నగర్, నాగార్జునసాగర్​బైపోల్‌లో ఓటమిని చవిచూసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్​ తగ్గింది. నాయకులు, కార్యకర్తలంతా నిరాశకు లోనయ్యారు. తాజాగా ఈటల గెలుపుతో పార్టీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. దీపావళి ముందస్తుగానే వచ్చిందని సంబురాలు చేసుకుంటున్నారు. నిన్నటివరకు టీఆర్ఎస్​ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను పోషించనున్నారు. టీఆర్ఎస్‌ను పొగిడిన నోటితోనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మాటల తూటాలు పేలుస్తారా అనేది వేచిచూడాల్సిందే.

బీజేపీ నేతలకు ముందస్తు దీపావళి..

ఈనెల నాలుగో తేదీన యావత్​ దేశం దీపావళి పండుగను జరుపుకోనుంది. కానీ బీజేపీ నాయకులకు ముందస్తుగానే పండుగ వచ్చింది. ఈటల గెలుపుతో బాణసంచా కాల్చి నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఆయన గెలుపుతో ముందస్తుగానే దీపావళి వచ్చిందని నాయకులు ఆనందంతో వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈటల గెలుపుతో జోష్ ​మీదున్న బీజేపీ ఇదే దూకుడును భవిష్యత్‌లో కొనసాగించాలని ప్రణాళికలు చేస్తోంది. వచ్చే ఎన్నికలపై అధిష్టానం ఫోకస్​ చేసి మరిన్ని సీట్లు కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే గ్రామస్థాయికి పార్టీని విస్తరింపజేయాలని చూస్తోంది. అప్పుడే తమకు పెద్ద పండుగ అని, నిజమైన దీపావళి వచ్చినట్లని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed