ధరలు పెంచనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్

by Harish |
ధరలు పెంచనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న వస్తువుల ధరల దృష్ట్యా దేశీయ ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ నుంచి ధరలను పెంచనున్నట్టు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ చాలాసార్లు ధరలను పెంచింది. ‘వస్తువుల ధరలు పెరిగాయి. గత కొన్ని నెలలుగా ధరల పెంపుతో పాటు పలు సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నించాం. పరిశ్రమలోని ఇతర కంపెనీల తరహాలోనే ఏప్రిల్ నుంచి తాము కూడా మరోసారి ధరలను పెంచాలని నిర్ణయించినట్టు’ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో వినోద్ కె దాసరి ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే, ధరల పెంపు అధికంగా ఉండదని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మధ్య తరహా మోటార్‌సైకిల్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా కలిగి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే దశాబ్దానికి మిడ్-సైద్ బైకుల విభాగంలో ఈ ఘనతను సాధించగలమనే నమ్మకం ఉందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ చెప్పారు. అంతేకాకుండా, ఎలక్త్రిక్ వెహికల్ టెక్నాలజీపై కంపెనీ పనిచేస్తోందని, ప్రస్తుతానికి వాటిని ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రణాళికలేవీ లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 1.99 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story