భయం లేదా..! పోలీసులకే సవాల్ విసురుతున్నారు

by Sumithra |
భయం లేదా..! పోలీసులకే సవాల్ విసురుతున్నారు
X

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ మహానగరంలో ఇటీవల పలువురు రౌడీ షీటర్ల వరుస హత్యలతో జనాలు భయంతో వణికిపోతున్నారు. సెటిల్మెంట్లు, పాత కక్షలతో ప్రత్యర్థుల హత్యలు కలకలం రేపుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని చెప్పుకుంటున్నా.. నగరం నడిరోడ్డున జరిగిన పలువురి హత్యలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి

నగరంలో ఇటీవల జరిగిన హత్యలు..

యాకత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 9న ఫర్రూస్ అనే రౌడీషీటర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. గతేడాది చంద్రాయణగుట్టలో జరిగిన ఓ హత్య కేసులో ఫర్రూస్ నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ హత్యకు గురైన రౌడీషీటర్ అనుచరులే ఫర్రూస్‌ను హత్య చేసినట్టుగా విచారణలో తేల్చారు. ఇది కాకుండా ఈ నెల 12వ తేదిన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌ జాబేర్‌ను నలుగురు దుండగులు వెంటాడి హత్య చేశారు. గతేడాది కాలాపత్తర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న రౌడీషీటర్ షానూర్ ఖాజీ హత్యకు ప్రతీకారంగానే జాబేర్ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇలా.. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 14 మర్డర్లు, 26 హత్యాయత్నం ఘటనలు చోటు చేసుకోవడంతో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం స్పష్టమవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

మళ్లీ ఉనికిలోకి రౌడీషీటర్లు

శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా వ్యవస్థ పనిచేస్తున్నా.. హత్యలను నియంత్రించడంలో మాత్రం పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. తరచూ క్రైమ్‌ చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం, రౌడీ షీటర్లుగా రికార్డుల్లో నమోదు చేయడం, కౌన్సెలింగ్ లాంటి చర్యలు చేపడుతున్నా ఫలితాలను రాబట్టడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక్క సౌత్ జోన్ (పాతబస్తీ)లోనే సుమారు 470 మంది రౌడీ షీటర్లు పోలీసుల రికార్డుల్లో ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీనికితోడు పట్టపగలు, నడిరోడ్డుపై యథేచ్చగా కత్తులతో దాడులకు దిగుతుండటం మరీ దారుణంగా తయారైంది. ఇదే పోలీస్ శాఖకు సవాల్‌గా మారుతోంది. దేశంలోనే అత్యధికంగా సీసీ కెమెరాల నిఘా ఉన్న విశ్వనగరంలో ఇటువంటి ఘటనలు చేటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed