మీ ‘బెంజ్’ కోసమైనా రోడ్డు వేయించండి

by Anukaran |   ( Updated:2020-08-21 08:19:17.0  )
మీ ‘బెంజ్’ కోసమైనా రోడ్డు వేయించండి
X

దిశ, వెబ్‌డెస్క్ : నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులను గ్రామస్తులు వివిధ రకాలుగా అడుగుతుంటారు. మరికొందరు నిరసనల రూపంలో తెలియజేస్తారు. వీటి ద్వారా తమ సమస్య ఎంత తీవ్రమైనదో వారికి వివరించే ప్రయత్నంలో అదొక భాగం. ఇలాంటివి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి నియోజకవర్గంలోని సమస్యను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మైలారం బాలు అనే స్థానికుడు దీనిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అయితే, రూ.3 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆ యువకుడు ముందుగా శుభాకాంక్షలు చెబుతూనే.. నియోజకవర్గంలోని గుంతలు పడిన రోడ్లకు సంబంధించిన ఫోటోలను కూడా ఓ ఫ్లెక్సీలో జతచేశాడు. ప్రజల కోసం కాకపోయిన మీ బెంజ్ కారు కోసమైనా గుంతలు పడిన ఈ రోడ్లను బాగు చేయాలని అందులో విజ్ఞప్తి చేశాడు. ఈ ఫ్లెక్సీ స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేతో పాటు, ప్రజలందరికీ తమ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉందో అర్థమయ్యేలా అతను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed