- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెడ్స్ ఫుల్.. డెంగ్యూకి అడ్డాగా హైదరాబాద్.. కారణం అదేనా?
దిశ, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు వణికిస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో డెంగ్యూ, రూరల్ లో టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా నుంచి ఉపశమనం పొందక ముందే సీజనల్ వ్యాధులు దాడికి దిగాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైన జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రులైన ఫీవర్, ఉస్మానియా, గాంధీకి రోగుల తాకిడి పెరిగింది. ఫీవర్ ఆసుపత్రిలో ప్రతీ రోజు సుమారు 3 వేలకు పైగా ఓపీ సేవలకు వస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఓపీకి వచ్చే వారిలో అత్యధికంగా డెంగ్యూ కేసులు వస్తున్నాయని అక్కడి డాక్టర్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. జిల్లా, ఏరియా ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వీరిలో ప్రతీ 100 మందికి టెస్టు చేస్తే కేవలం 7 గురికి మాత్రమే కరోనా సోకుతుందని, మిగతా వారందరికీ సీజనల్ వ్యాధుల పాజిటివ్‌గా తేలుతుందన్నారు.
గత పదిహేను రోజుల నుంచి కరోనా కేసులు కంటే డెంగ్యూ బాధితులే అత్యధికంగా తేలడం గమనార్హం. ఒక్క ఆగస్టు నెలలో అధికారికంగా 1720 డెంగ్యూ కేసులు తేలాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. గడిచిన వారంలో ఆదిలాబాద్ , ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో డెంగ్యూ వ్యాధితో 20 మంది చనిపోయినట్లు సమాచారం. అనధికారంగా వీటి సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుందని డీసీజ్ కంట్రోల్ బోర్డులో పనిచేసే ఓ అధికారి ‘దిశ’కు తెలిపారు. మరో రెండు నెలల వరకు రాష్ర్టంపై విషజ్వరాల ప్రభావం ఉంటుందని, ఆ తర్వాత స్వైన్ ఫ్లూ షురూ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వైద్యాధికారులు, రోగాల నివారణకు కృషి చేయాల్సిన పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతోనే రోగాలు బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నదని పలువురు మండిపడుతున్నారు.
నిలోఫర్‌లో నిండిపోయిన బెడ్లు…
డెంగీ వ్యాధి చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో నిలోఫర్‌లో బెడ్లన్నీ నిండిపోయాయి. సుమారు 7 నుంచి 800 మంది చిన్నారులు వివిధ రకాల లక్షణాలతో అడ్మిట్ అవగా, వీరిలో 40 శాతం మందికి డెంగ్యూ తేలినట్టు అధికారులు ధృవీకరించారు. దీంతో పాటు గాంధీలో కూడా రెండు వారాల నుంచి 80 మంది చిన్నారులు డెంగ్యూతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్రమైన జ్వరం, అలసట, వాంతులు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని గాంధీ డాక్టర్లు సూచించారు.
ప్లేట్‌లెట్‌లకు పరుగులు…
డెంగీ విజృంభిస్తుండటంతో రాష్ర్టంలో ప్లేట్ లెట్ లకు కొరత ఏర్పడింది. ప్రతీ రోజు ఒక్కో బ్లడ్ బ్యాంకులకు సుమారు 5 నుంచి 10 మంది ప్లేట్ లెట్ కొరకు ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. వాస్తవంగా జ్వరం వచ్చిన 80 శాతం మందికి సాధారణంగా ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్లేట్ లెట్స్ ఎక్కించాలంటూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో చాలా మంది రూ. 15 నుంచి 30 వరకు ఖర్చు చేసి ప్లేట్ లెట్స్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో రక్తం నుంచి ప్లేట్ లెట్ ను వేరు చేసే మిషన్లు అందుబాటులో ఉన్నాయని, కొరత లేదని వైధ్యాధికారులు చెబుతున్నారు. కానీ దాతలు దొరకడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా బ్లడ్ ఇచ్చేందుకు ముందుకు వస్తాలేరంటున్నారు.
డెంగ్యూ వ్యాప్తికి కారణం ఇదే…
కలుషిత నీటితో టైఫాయిడ్ వ్యాధి ప్రబలుతుండగా, ఏడీస్ దోమతో డెంగ్యూ వ్యాప్తి చెందుతున్నది. రాష్ర్ట వ్యాప్తంగా ఇటీవల మున్సిపల్, వైద్యాధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ లో ఏకంగా 59.9 శాతం డెంగ్యూ లార్వ ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా మేడ్చల్‌లో 57.7, మహబూబ్‌నగర్‌లో 46.2, రంగారెడ్డిలో 46 శాతం డెంగ్యూ లార్వ తేలింది. దీంతోనే హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక ఆదిలాబాద్‌లో 44.5, వరంగల్ అర్బన్‌లో 41.4, వరంగల్ రూరల్‌లో 40 శాతం లార్వను గుర్తించారు. వాస్తవంగా 30 శాతం లార్వ ఉంటే వెంటనే దాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కానీ శాఖల మధ్య సమన్వయం లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
20 వేల కంటే తక్కువుంటేనే ప్లేట్ లెట్‌లు ఎక్కించాలి: డా శంకర్ ఫీవర్ ఆసుపత్రి
డెంగ్యూ సోకిన ప్రతి ఒక్కరికీ ప్లేట్ లెట్స్ అవసరం లేదు. సాధారణంగా మానవుని శరీరంలో లక్షా 50 వేల నుంచి గరిష్ఠంగా 4 లక్షలు వరకు ప్లేట్ లెట్‌లు ఉంటాయి. వీటిలో 20 వేల కంటే తక్కువుండి బ్లీడింగ్ అయితేనే ప్లేట్ లెట్స్ అవసరం అవుతుంది. కొన్ని కేసుల్లో వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఎక్కించాల్సి వస్తున్నది. కానీ పది వేల కంటే తక్కువుంటే తప్పనిసరిగా ప్లేట్ లెట్ లను ఎక్కించాలి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్లేట్ లెట్ కొరత చూపిస్తున్నట్లు సమాచారం ఉన్నది. ప్రైవేట్ కు వెళ్లే వారు సెకండ్ ఓపీనియన్ తీసుకోవడం కూడా బెటర్.
ఈనెల 2 వరకు అత్యధికంగా డెంగ్యూ కేసులు తేలిన జిల్లాలు..
హైదరాబాద్ 765
ఆదిలాబాద్ 104
ఖమ్మం 354
కొత్తగూడెం 133
మహబూబ్ నగర్ 149
మేడ్చల్ 150
రంగారెడ్డి 189