రేవంత్‌కు అస్త్రం అందించిన సీఎం కేసీఆర్!

by Anukaran |   ( Updated:2021-06-28 11:15:40.0  )
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వివాదాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు అదే అంశం తలకు చుట్టుకోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్​పరిస్థితిని బట్టి గులాబీ బాస్​… సెంటిమెంట్​ను రగిలించే ప్రయత్నాలు చేసినట్లు భావిస్తున్నారు. దీన్ని హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా తీసుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూసినట్లు అయింది. ఓవైపు బీజేపీ అన్యాయం చేస్తుందని అటు కాషాయ పార్టీని, నీళ్లను తరలించుకుపోతుంటే ఏం చేసిందని కాంగ్రెస్​ను ఇరుకున పెట్టేందుకు కేసీఆర్​భారీ స్కెచ్ వేశారు. ముందుగానే మంత్రులను ఉసిగొల్పారు.

దీంతో కృష్ణా జలాలతో సంబంధం లేని ఉత్తర తెలంగాణ మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎర్రబెల్లి, విప్​బాల్క సుమన్​ వంటి నేతలు దానికి ఆజ్యం పోసే ప్రయత్నాలు చేశారు. అటు ఏడేండ్లుగా పలుకరించేందుకు కూడా ఇష్టపడని కాంగ్రెస్​ నేతలను ప్రగతిభవన్​కు పిలిపించుకున్నారు. ఇలా హుజురాబాద్​ ఉప ఎన్నికలతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ప్రయత్నాలు చేసిన టీఆర్ఎస్​అధినేతకు రేవంత్​రెడ్డి రూపంలో షాక్​ తగిలింది. అనూహ్యంగా టీపీసీసీ చీఫ్​ప్రకటన రావడంతో ఇప్పుడు కృష్ణా జలాల అంశం తమకు ఎలాంటి పరిణామాలు తెచ్చి పెడుతుందనే భయం కూడా పట్టుకుంది.

రేవంత్ ​పట్టుకుంటారా..?

కృష్ణా జలాల విషయంలో టీఆర్ఎస్ ద్వంద వ్యూహాలు అమలు చేసే ప్లాన్​ చేసింది. ముందుగానే సుప్రీం కోర్టులో పిటిషన్​ను ఉపసంహరించుకుని మొత్తం కేంద్రంపై భారం పెట్టినట్లు చేసింది. దీంతో కేంద్రం ఇంకా దీనిపై ఎలాంటి అడుగులు వేయలేదు. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ఆధ్యుడు వైఎస్​ రాజశేఖరరెడ్డిని బూచిగా చూపిస్తూ అటు జగన్​పై విమర్శలు పెంచింది. దీంతో కాంగ్రెస్​ పార్టీ కూడా ఎలా రియాక్ట్​ కావాలో తెలియని సందిగ్థంలో పడింది.

కానీ రేవంత్​రెడ్డికి ఇదే మంచి తరుణమనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతగా కృష్ణా జలాల దోపిడీపై టీఆర్ఎస్​ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమయ్యారంటున్నారు. దీనికి కొంతమంది నీటిపారుదల నిపుణులు కూడా ఆయనకు సాయంగా నిలుస్తున్నారని ప్రచారం కూడా ఉంది. ఏడేండ్ల నుంచి దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసిన వైనాన్ని రేవంత్​రెడ్డి అందుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినంత స్పీడ్​లో కొంతైనా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించనున్నారు.

అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులో దక్షిణ తెలంగాణలో ఇంకా సాగుతున్నాయి. టీఆర్ఎస్​ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులపై ఎక్కడా ముందుకెళ్లలేదు. కానీ ఇప్పుడు అలంపూర్​పై బ్యారేజీ, ఇంకో రెండు, మూడు ప్రాజెక్టులు అంటూ కొత్త రాగం అందుకుంది. కానీ ఇవి ఎప్పటి వరకు పూర్తి చేస్తారనేది తేలని ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి, డిండి, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా వంటి ప్రాజెక్టులు ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. కనీసం బిల్లులు కూడా ఇవ్వడం లేదు. దీంతో పనులన్నీ ఆగిపోయాయి. ఇవన్నీ రేవంత్​రెడ్డికి అవకాశంగా మారనున్నాయి.

మరోవైపు బీజేపీని కూడా ఇదే అంశంలో ఇరుకున పెట్టే ఛాన్స్​ కాంగ్రెస్​కు ఇచ్చినట్లుగా మారిందంటున్నారు. ఒకేసారి అటు టీఆర్ఎస్, బీజేపీని ప్రశ్నించేందుకు రేవంత్​కు అవకాశం దొరికినట్లు అయిందని దక్షిణ తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్‌కు కష్టమే..!

వాస్తవంగా ఒక విధమైన వ్యూహంతో కృష్ణా జలాల అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చారనే ఆరోపణలు టీఆర్ఎస్​పై ఉన్నాయి. రానున్న ఎన్నికల కోసం ఇరు రాష్ట్రాలు ఒక సెంటిమెంట్​ను రగలించేందుకు ఈ జల వివాదాలను అస్త్రంగా వాడుకుంటున్నాయనే విమర్శలున్నాయి. తెలంగాణపై ఏపీ… ఏపీ మీద తెలంగాణ ఇలా విమర్శలు చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో సెంటిమెంట్​ఓట్లను రాబట్టుకునే ప్లాన్​ అంటూ ఆరోపిస్తున్నారు. కానీ అనుకోని సంఘటన తరహాలో రేవంత్​రెడ్డికి పీసీసీ ఇవ్వడం, దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెంది నేత కావడంతో ఈ జలాల అంశపై రేవంత్​ గళమెత్తేందుకు చాలా అవకాశమంటూ సూచిస్తున్నారు. ఒక విధంగా టీఆర్ఎస్​తమకు అనుకూలమవుతుందని భావించి కొత్త కష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు మారిందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు దీన్ని రేవంత్​రెడ్డి ఎలా తీసుకుంటారని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అనుకున్నట్టే ఈ జల వివాదాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణాలను చూపిస్తే… కాంగ్రెస్​కు కలిసి వస్తుందంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed