మూడు సార్లు కలుసుకున్న ఆ ఇద్దరు.. కలిసేఉంటారా..?

by Anukaran |   ( Updated:2021-10-01 08:18:52.0  )
మూడు సార్లు కలుసుకున్న ఆ ఇద్దరు.. కలిసేఉంటారా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ముచ్చటగా మూడు సార్లు మాత్రమే కలిసిన ఆ నేతలిద్దరి మధ్య బంధం ఇలాగే బలపడుతుందా లేక అంటీముట్టనట్టుగానే ఉంటారా అన్న చర్చ సాగుతోంది. భూపాలపల్లి వేదికగా మరోసారి కలుసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబులు ఇంతకాలం ఎడముఖం-పెడ ముఖం అన్నట్టుగానే ఉన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తరువాత శ్రీధర్ బాబును నేరుగా వెళ్లి కలిశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో మరో సారి కలుసుకోగా తాజాగా భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ జాయిన్ అయిన సందర్భంగా ముచ్చటగా మూడో సారి కలుసుకున్నారు. ఈ సభా వేదికపై ఇరువురు నేతలు తమ ప్రసంగంలో ఒకరినొకరు పొగుడుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఇలాగే బలపడుతుందా.. లేదా అన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

హుజురాబాద్ విషయంలో…

రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుతున్న నేపథ్యంలో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు కూడా శ్రీధర్ బాబు దూరంగానే ఉన్నారు. అభ్యర్థి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలతో పాటు హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను కూడా అప్పగించినప్పటికీ ఆయన మాత్రం పట్టించుకోలేదు. దీంతో రేవంత్, శ్రీధర్‌ల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది.

తాజాగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉన్నందున శ్రీధర్ బాబు ఈ సభకు అటెండ్ అయ్యారు. ఇప్పటి వరకు ఒకరి గురించి ఒకరు బాహాటంగా మాట్లాడుకున్న వేదిక ఇదే కావడం విశేషం. నిన్న మొన్నటి వరకు దూరం దూరంగా ఉన్న వీరిద్దరు ఒకే వేదికపై కనిపించడంతో రానున్న కాలంలోనూ వీరు ఇలాగే సాన్నిహిత్యంగా మెదులుతారా లేక గతంలో లాగానే మెయింటెన్ చేస్తారా అన్న చర్చ సాగుతోంది.

Advertisement

Next Story