- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇండియావైడ్ బైక్ లవర్స్‌ను కనెక్ట్ చేస్తున్న ‘రెవ్ యువర్ సోల్’ యాప్
దిశ, ఫీచర్స్ : ‘నో రోడ్ ఈజ్ టూ లాంగ్ ఇఫ్ యూ హావ్ ఏ గుడ్ కంపనీ’ అంటూ బైకర్స్ ప్రపంచాన్ని చుట్టేస్తుంటారు. అందుకే యువతకు ‘బైక్ రైడింగ్’ ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తదాన్ని అన్వేషించడానికి ఎల్లప్పుడూ వెతుకుతూ ఉండే బైకర్స్, వివిధ నగరాల నుంచి కొత్త స్నేహితులను సంపాదించడానికి బైకింగ్ ఉత్తమ మార్గంగా అభివర్ణిస్తారు. గజిబిజీ జీవితం నుంచి విరామం తీసుకుని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చుట్టేసేందుకు బైకర్స్ ప్లాన్ చేస్తుంటారు. ‘వి రైడ్ టు ఫీల్, టు బ్రీథ్, టు లాఫ్, టు రిలాక్స్, టు ఫీల్ స్ట్రాంగ్, టు లైవ్’ అని నమ్మే బైక్ ట్రావెలర్స్.. రహదారుల్లో జీవితపు సంతోషాలను పోగేసుకుంటారు. హైదారబాద్‌కు చెందిన ఆనంద్ మోహన్ మూర్తి అలాంటి ప్యాషన్ ఉన్న బైకర్. వృత్తిరీత్యా న్యాయవాది అయినా బైకర్‌గా తన హ్యాబీని కొనసాగిస్తూ, కొత్త కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తనలాంటి బైకర్స్‌ను ఒక్కచోట కలిపేందుకు ‘రెవ్ యువర్ సోల్’ అనే యాప్‌ను తీసుకొచ్చాడు.
చాలామందికి లాంగ్ రైడ్ వెళ్లాలనుంటుంది. కానీ ఒంటరిగా బైక్ ట్రిప్ వెళ్లాలంటే కాస్త కష్టమే. అంతేకాదు కొన్ని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం అంత సురక్షితం కాదు. అందులోనూ సేఫ్ రైడింగ్ రూట్స్ తెలిసుండటం చాలా ముఖ్యం. అందుకోసమే రైడ్‌లో కంపెనీ కోసం స్నేహితులు, బంధువులను సమీకరిస్తుంటారు. కానీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ ఉండే ఈ కాలంలో, మన రైడ్ కోసం ఇంకొకరు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పడంతో పాటు, బైక్ లవర్స్ అందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ‘రెవ్ యువర్ సోల్’ అనే యాప్ తీసుకొచ్చారు ఆనంద్, సంధ్య దంపతులు. దేశవ్యాప్త బైకర్లతో కనెక్ట్ కావడానికి, సుదూర తీరాల్ని బైకర్స్ గ్యాంగ్‌తో చుట్టిరావడానికి, తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ యాప్ ఓ ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌గా మారింది. బైకర్ కమ్యూనిటీ ప్రయోజనాలతో రూపొందిన ఈ యాప్‌లో బైకర్లు స్వతంత్రంగా రైడ్‌లను నిర్వహించవచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైడ్‌లు, బైకింగ్ ఈవెంట్‌లలో పాల్గొనడానికి యాక్సెస్ కూడా ఉంటుంది. బైకర్స్ కమ్యూనిటీలతో తమ తమ రైడ్ ఎక్స్‌పీరియన్స్, స్టోరీలను పంచుకోవచ్చు కూడా.
ప్లేస్టోర్ లేదా ఆపిల్ స్టోర్‌లలో ‘రెవ్ యువర్ సోల్’ యాప్ అందుబాటులో ఉంది. యాప్‌లో యాక్సెస్ కోసం బైకర్స్ తమ లైసెన్స్, బైక్ పత్రాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలి. ఒంటరిగా లేదా సమూహంలో ప్రయాణించేటప్పుడు బైకర్స్ రక్షణతో పాటు, ప్రయాణాలను విజయవంతంగా అమలు చేయడానికి స్పెషల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. తోటి బైకర్ల కదలికలను పర్యవేక్షించడానికి ఇది ప్రత్యక్ష GPS ట్రాకింగ్‌ను కలిగి ఉంటుంది. బైకర్ ఎక్కడ ఉన్నా అత్యవసర SOS సందేశాలు అందించడంతో పాటు, మెడికల్, పోలీసులకు కాల్స్ యాక్సెస్ చేసే సౌలభ్యం ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి నిమిత్తం వారి బ్లడ్ గ్రూప్, హెల్త్ కండిషన్, కుటుంబ సభ్యుల పరిచయాలు, సన్నిహితుల వివరాలు కూడా ఇందులో ఉంటాయి.
ఈ యాప్ ద్వారా బైకర్లు తమ రైడింగ్ ప్రారంభమయ్యే డేట్, ఎండింగ్ డేట్, రైడ్ సమయం, హాల్ట్‌ల సంఖ్య, కవర్ చేయవలసిన దూరం వంటి వివరాలను కచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఆధారంగా తోటి రైడర్‌లను, స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. రాష్ట్రంలో గొప్ప బైకింగ్ మార్గాల గురించి అవగాహన పెంచడానికి తెలంగాణ పర్యాటక శాఖతో ‘రెవ్ యువర్ సోల్’ నిర్వాహకులు జతకట్టారు. ఇక ప్రపంచంలో అతిపెద్ద బైకింగ్ కమ్యూనిటీని నిర్మించి, భారతదేశాన్ని గ్లోబల్ మ్యాప్‌లో బైకర్స్ గమ్యస్థానంగా ఉంచాలన్నదే ఆనంద్ విజన్. ఇండియాలో మోటో జిపి(గ్రాండ్ ప్రిక్స్), ఎస్‌బికెకు ఆతిథ్యం ఇవ్వడానికి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి మోటోసైక్లిస్మే(ఎఫ్ఐడీఎమ్) ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రాండ్ ప్రిక్స్ మోటారుసైకిల్ రేసింగ్ అనేది మోటారుసైకిల్ రోడ్ రేసింగ్ ఈవెంట్లలో ప్రీమియర్ క్లాస్.. ఇది ఎఫ్ఐడీఎమ్ మంజూరు చేసిన రోడ్ సర్క్యూట్లలో జరుగుతుంది.
‘నా సొంత రైడింగ్ అనుభవాలు, నా ప్రయాణంలో నేను ఎదుర్కొన్న సమస్యలు నన్ను‘ రెవ్ యువర్ సోల్ యాప్ సృష్టించేలా చేయడంతో పాటు, రైడ్ సురక్షితంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు నన్ను ప్రేరేపించాయి. బైకర్లు ఆయా బౌండరీలు, వాట్సాప్ గ్రూపులకే పరిమితమైనందున జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా బైకర్లతో కనెక్ట్ అవ్వడానికి సరిహద్దులకు మించిన వేదిక ఇది. అందుకే ఈ యాప్ ద్వారా ‘బైకింగ్ ఎకో సిస్టమ్’ను సృష్టించాలనుకున్నాను. ఇప్పటివరకు 40-50 రైడ్స్ నిర్వహించగా, యాప్ ద్వారా 250కిపైగా రైడ్స్ పూర్తయ్యాయి. 8వేలకు పైగా రైడర్స్ ఇందులో భాగమయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఆఫ్‌లైన్ కార్యకలాపాలను నిలిపివేశాం. కానీ సెప్టెంబరు నాటికి పరిస్థితి తేలికవుతుందని ఆశిస్తున్నాం. ఆ సమయంలో గోవాకు ప్రయాణించడానికి నేను ఇప్పటికే ప్రణాళిక వేశాను. అంతేకాదు ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా బైకర్స్ తమ బైక్‌లు, బైకింగ్ సామగ్రిని విక్రయించగల మార్కెట్ స్థలాన్ని కూడా ప్రారంభించాం. బైకింగ్ నిపుణులు, బ్లాగర్లు, ఇతరుల బైక్ లవర్స్, రైడర్స్ తమ విలువైన సూచనలు, అనుభవ పాఠాలను అందించేందుకు వర్చువల్ మీట్‌లను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. ఇక ఈ యాప్ రూపొందించేందుకు నా భార్య సంధ్య కూడా ఓ కారణం. తను లైఫ్‌లోనే కాదు, ఈ బిజినెస్‌లోనూ, నా బైక్ రైడింగ్‌లోనూ పార్ట్‌నర్.
– ఆనంద్ మోహన్ మూర్తి, రెవ్ యువర్ సోల్ యాప్ ఫౌండర్
‘నేను చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశాను. నా ఉద్యోగ ప్రయాణంలో నేను లిక్కే (పీర్-టు-పీర్ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్), కామ్ గొరిల్లా టీ (ప్రత్యేక టీ కంపెనీ)అనే రెండు స్టార్టప్‌లను ప్రారంభించాను. నా సొంత కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు వెళ్లినప్పడు బెనెల్లి ఓనర్స్ గ్రూప్ ద్వారా ఆనంద్‌ను కలిశాను. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. బెనెల్లి సాక్షిగా మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఇక నా ఆలోచనలు, అనుభవాలతో పాటు, ఆనంద్ థాట్స్ మ్యాచ్ కావడంతో రెవ్ యువర్ సోల్‌కు పునాది పడింది. ఆ తర్వాత ఎన్నో డిస్కషన్స్ తర్వాత యాప్ తీసుకొచ్చాం’
– ఎన్. సంధ్య, కో-ఫౌండర్, డైరెక్టర్